‘ఖైదీ’ వేడుకకు ఆ ఇద్దరే..!

357

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన తాజా చిత్రం ‘ఖైదీ నంబ‌ర్ 150’. ఈ నెల 11వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకురానుంది. విడుద‌ల‌కు ముందు ఈ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌ను ఈ నెల 7వ తేదీన నిర్వ‌హించ‌నున్నారు. గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌వేదిక‌గా ఈ ఫంక్ష‌న్ జ‌రుగ‌నుంది. అయితే, ఈ ఫంక్ష‌న్‌కు మెగా సోద‌రుడు, జ‌న‌సేన పార్టీ అధినేత‌, క‌థానాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌స్తార‌నే ఊహాగానాలు వ‌చ్చాయి. అయితే, ఇప్పుడు అవి కేవ‌లం పుకార్లేన‌ని తేలిపోయాయి. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు దాస‌రి నారాయ‌ణ రావు, కె.రాఘ‌వేంద్ర‌రావు హాజ‌ర‌వుతార‌ని క‌థానాయ‌కుడు, ఈ చిత్ర నిర్మాత కూడా అయిన‌ రామ్ చ‌ర‌ణ్ వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం ఫారిన్ టూర్‌లో ఉన్న చెర్రీ అక్క‌డి నుంచే ఫేస్‌బుక్‌, ద్వారా ఈ ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌కు సంబంధించిన వివ‌రాలు తెలియ‌జేశారు. చాలా మంది డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు కూడా ఈ ఈవెంట్‌కు వ‌స్తార‌ని, త‌న బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కూడా ఆహ్వాన ప‌త్రిక ఇస్తామ‌ని చ‌ర‌ణ్ చెప్పారు. హాలిడే ట్రిప్ కోసం చ‌ర‌ణ్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు త‌మ కుటుంబాల‌తో స్విట్జ‌ర్లాండ్ తదిత‌ర దేశాల్లో టూర్‌లో ఉన్న విషయం తెలిసిందే.