చిరంజీవి గారికి సారీ: వర్మ

178
‘ఖైదీ నెం. 150’ చిత్రం ప్రీ లాంచ్ వేడుకలో మెగా బ్రదర్ నాగేంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో స్పందించారు. ఈ అంశంపై శనివారం రాత్రి వరుసపెట్టి ట్వీట్లు చేశారు. చివరగా.. తన తరఫున చిరంజీవిగారికి సారీ చెప్పమంటూ నాగేంద్రబాబును కోరారు. ఆయన ట్వీట్లలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి…
”నాగబాబు గారూ, మీరు ట్విట్టర్‌లో లేరు కాబట్టి ఎవరైనా నా ఈ ట్వీట్లు మీకు చూపిస్తారని ఆశిస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. నేనేదో నా స్టైల్లో అందరి మీద అన్నింటి మీద ఏదో ఒక అభిప్రాయం చెబుతూ ఉంటాను. ఒట్టి మీ ఫ్యామిలీ మీదే కాదు.. అది వినే ఉంటారు. నా ట్వీట్లు మోదీ గారి దగ్గర నుంచి బచ్చన్‌గారి వరకు చివరకి నా మీద నేనే చాలా కామెంట్లు చేస్తూ ఉంటాను. కానీ మీరు చాలా అఫెండ్ అయ్యి, హర్ట్ అయ్యారని నాకు తెలిసింది కనుక నేను చాలా నిజాయితీగా మీకు, మీ కుటుంబానికి సారీ చెబుతున్నాను. నా ఉద్దేశం వేరే అయినా మీరు హర్ట్ అయ్యారు కనుక చిరంజీవి గారికి కూడా నా తరఫున దయచేసి సారీ చెప్పండి.. థాంక్స్” అని వర్మ ముగించారు.