నేను పార్టీ పెట్టను!

253

“మాది ప్రజల పక్షాన పోరాటమే తప్ప, పదవులపై ఆరాటం కాదు” అన్నారు తెలంగాణ జెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్. అసలు తనకు రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. “నేను పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్తానన్నది పాలకుల కుయుక్తి. ఒక వ్యూహాత్మక దాడి. ప్రజలను గందరగోళంలోకి నెట్టడానికి, నాయకులను నైతికంగా దెబ్బతీయడానికి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తారు” అని కొట్తిపారేశారు. ముఖ్యమంత్రిగా ఎవరు పీఠమెక్కినా, తాము(జేఏసీ)మాత్రం ప్రజల పక్షానే నిలబడతామని వివరించారు. వరగల్ పర్యటన్లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ… “ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే వంకరగా మాట్లాడడం పాలక వర్గాలకు అలవాటే”నని విమర్శించారు.

టిఆర్ఎస్ పాలనలో అణచివేత ఎక్కువ

టిఆర్‌ఎస్‌ పాలనలో ఉమ్మడి రాష్ట్రాన్ని మించిన అణచివేత కనిపిస్తోందన్నారు. అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు ఓపిక ఎక్కువని, ఓపిక నశిస్తే తడాఖా చూపిస్తరని హెచ్చరించారు. సిఎంను కలిసే అవసరం తనకు రాలేదంటూనే… మంత్రులు, చీఫ్‌ సెక్రటరీలకు కూడా అందనంత బిజీలో సిఎం ఉండవచ్చని ఎద్దేవా చేశారు. కెసిఆర్‌ మిత్రుడే అయినా, ప్రజల కంటే ఆత్మీయ మిత్రుడు కాదన్నారు. “ఇప్పుడున్న పార్టీల్లో కీలక స్థానాల్లో రెడ్లు, వెలమలు, ఇతర అగ్రకులాలకు చెందినవాళ్లే ఉన్నారు. నిరసనలు, ఆందోళనలకు ఆయా పార్టీల ప్రతినిధులుగా వాళ్లు తప్పకుండా వస్తారు. అంతమాత్రాన రెడ్లతో కలిసినట్లు కాదు కదా! నాకు కుల పట్టింపు లేదన్న సంగతి తెలంగాణ మొత్తానికి తెలుసు” అన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తులెవరో, మంత్రివర్గంలో తెలంగాణ అనుకూలంగా మాట్లాడినవాళ్లు ఎంతమంది ఉన్నారో ప్రజలకు తెలుసన్నారు. అనవసర విమర్శలు మాని ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచెయ్యాలని హితవు పలికారు.