2017- రాశి ఫలాలు

550

మేషరాశి ఫలాలు:

అశ్విని4 పాదాలు, భరణి4 పాదాలు, కృత్తిక1వపాదం

ఆదాయం : 5           వ్యయం : 5  రాజపూజ్యం : 3 అవమానం : 1

ఇది మీకు సామన్య సంవత్సరం. సంవత్సర ప్రారంభం నుంచి అభివృద్ధి కనిపిస్తుంది. . అష్టమశని విరగడవుతుండడంతో సమస్యలనుంచి మెల్లిగా బయటపడతారు.  మీ శక్తిసామర్ధ్యాలను నిరూపించుకుంటారు. అనుకున్న ప్రయోజనాలు రాబట్టడంలో సఫలమవుతారు. కుటుంబసభ్యుల సహకారంతో అన్నిరకాల ఇబ్బందులనుంచి బయటపడతారు. ప్రశాంతతను చెడగొట్టే వ్యక్తులను దూరంగా పెడతారు. పోరాట పటిమను పెంచుకుంటారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. సామాజిక సంబంధాలు మెరుగుపరుచుకుంటారు. అహం విడిచిపెడితే కోల్పోయిన మిత్రులను సైతం వెనక్కు తెచ్చుకోగలుగుతారు.  సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పెంచుకోగలుగుతారు. స్వంత ఇంటికలను నెరవేర్చుకోగలుగుతారు. భూ కొనుగోళ్లు చేస్తారు. విహారయాత్రల్లో అపశ్రుతులు దొర్లే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించండి. సెప్టెంబర్ మాసం తరువాత వివాహం ఖరారవుతుంది.

కుటుంబం

జీవితభాగస్వామితో ప్రేమానురాగాలు బలపడతాయి. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. సంతానం ఆరోగ్యం కలతపెడుతుంది. అయితే వారి విద్యాభివృద్ధి ఆనందాన్నిస్తుంది.  బంధుమిత్రులతో విభేదాలు పొడచూపుతాయి. ముందుజాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో సౌఖ్యవంతమైన వాతావరణం నెలకొంటుంది.

ఆరోగ్యం

శ్రమ పెరుగుతుంది. పనిలో ఒత్తిడి కారణంగా కోపం, అసహనం పెరుగుతాయి. శాంతంగా ఆలోచిస్తూ పరిష్కారం దిశగా అడుగులు వేయండి. ఆహార నియమాలు పాటించలేని పరిస్థితుల్లో జీర్ణ సంబంధ సమస్యలు ఎదురవుతాయి. వ్యాయామంపై శ్రద్ధపెట్టండి. ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించండి. తరచుగా స్వల్ప అనారోగ్యాలు బాధిస్తాయి. వాటినుంచి తప్పించడానికి యోగా సహకరిస్తుంది.

ఆర్థికం

సంవత్సర ద్వితీయార్ధంలో ఆర్థికంగా బలపడతారు. ఆదాయానికి తగిన ఖర్చులు చేస్తారు. అతికష్టం మీద ఆర్థికస్థితి మెరుగుపరుచుకోగలుగుతారు. నూతన ఆదాయమార్గాల కోసం వేచిచూస్తారు. అష్టమశని కారణంగా జనవరి 26వరకు ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. అటు తరువాత రాని బకాయిలు వసూలవుతాయి.

వృత్తివ్యాపారాలు

నూతన వ్యాపార ప్రారంభానికి ద్వితీయార్ధం బాగుంటుంది. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. పనిలో అసందిగ్ధతలుంటాయి. అయినప్పటికీ మీలో తరగని ఉత్సాహం, మేధోసంపద మిమ్మల్ని రక్షిస్తాయి. వాయిదాలు వేయకుండా ఎప్పటి పని అప్పుడే చేయండి. పై అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. పదోన్నతి అవకాశాలు మెరుగవుతాయి. వృత్తి వ్యాపార రహస్యాలు ఎవరితోనూ పంచుకోవద్దు. వ్యాపార సంబంధ ప్రయాణాలు లాభిస్తాయి.

ఆర్ధిక వ్యవహారాలు

అదనపు ఆదాయ అవకాశాలు తెరుచుకుంటాయి. అవసరానికి తగిన డబ్బు సమకూర్చుకోగలుగుతారు. వ్యయాలపై అదుపు సాధించండి. సంవత్సర ద్వితీయార్ధంలో ఆర్ధిక సర్దుబాట్లు సులభతరమవుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. స్పెక్యులేషన్ పట్ల ఆచితూచి వ్యవహరించాలి.

అదృష్ట సంఖ్యలు : 9, 1, 2, 3

అనుకూలమైన వారాలు :  ఆది, సోమ, గురు శుక్రవారాలు
పరిహారాలు : హనుమదారాధన చేయండి. శని జపం చేయించండి.
వృషభరాశి ఫలాలు:

కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1,2 పాదాలు

ఆదాయం – 2, వ్యయం – 8, రాజపూజ్యం – 7, అవమానం – 3

 

జీవనగమనంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.  వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. గురు, రాహువుల సంచారం మీకు అనుకూలిస్తుంది. ప్రత్యేకించి సంవత్సర ద్వితీయార్ధంలో అన్నివిధాలా అనుకూలతలుంటాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పనివత్తిడి వల్ల కలిగిన ఆందోళన శృతి మించకుండా దైవధ్యానం చేయండి. చిన్న చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యం చేయకండి. క్రమశిక్షణతో పని ఒత్తిడిని ఎదుర్కోండి. శరీర శ్రమ తప్పదు, కానీ మానసికంగా మీ ఉత్సాహం మిమ్మల్ని ఒడ్డెక్కిస్తుంది. సృజనాత్మక రంగాలలో వారి కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. లౌక్యంతో వ్యవహరించి పనులు చక్కపెట్టుకుంటారు. . ఆర్ధిక వ్యవహారాలు కొంత లాభదాయకంగానే ఉన్నా తొందరపాటు తగదు.

కుటుంబం

విలాస వస్తువులు సేకరిస్తారు. కుటుంబం అభివృద్ధి ఆనందాన్నిస్తుంది.  జీవిత భాగస్వామితో సామరస్యం కోసం ప్రయత్నించండి. గొడవలు పడకండి. మీ బిజీషెడ్యూల్ మధ్యకూడా కుటుంబం కోసం సమయం కేటాయించండి. మీ ప్రవర్తన కుటుంబానికి సంతోషదాయకమవుతుంది. సంతానం అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది.

ఆరోగ్యం

మీ ఆరోగ్యస్థితి చక్కబడుతుంది. అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను ఆహార నియమాల ద్వారా అధిగమించే ప్రయత్నం చేయండి. ఎలర్జీ వంటి శారీరక సమస్యలుండవచ్చు. యోగాసనాలు, ప్రాణాయామం ద్వారా మీ అనారోగ్య సమస్యలను పరిష్కరించుకోండి. సకాలంలో నిద్రపోవడం అతిముఖ్యమైనది. 

ఆర్థికం

ధనవ్యయం అధికంగా ఉంటుంది. విందులు వినోదాలు కాస్త తగ్గించుకోవాలి.  అదనపు ఆదాయమార్గాలను అన్వేషించాలి. వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి యధాతథంగా నడుస్తుంది. ద్వితీయార్ధంలో మీకున్న సమస్యలన్నింటినీ అధిగమిస్తారు. ధన సంపాదన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరనుకున్నది సాధిస్తారు.

వృత్తి వ్యాపారాలు 

శ్రమాధిక్యత ఉంటుంది. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. మానసికంగా స్థైర్యాన్ని పంచుకోండి. ఉద్యోగరీత్యాగానీ, వ్యాపారరీత్యాగానీ ఇంటి నుండి దూరంగా కాలం గడపవలసి వస్తుంది. ఏప్రిల్ మాసం నుండి కొత్త ఆదాయమార్గాలు వెతుకుతారు. ఉన్న వ్యాపారాన్ని విస్తృతపరిచే ప్రయత్నాలు చేయండి. మీ విదేశీ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. స్థిరాస్తి సంబంధ విషయాలలో లబ్ది పొందుతారు. షేర్లు, స్పెక్యులేషన్స్ వంటివి లాభిస్తాయి.

విద్యార్థులకు

విద్యారంగం వారికి, విద్యార్థులకు శుభదాయకంగా ఉంటుంది. ఉన్నత విద్యల కోసం ప్రయత్నించే విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందుతారు. ఏకాగ్రత పెరుగుతుంది. మీ పట్టుదల, శ్రద్ధ మీ విజయానికి మూలం. విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

అదృష్ట సంఖ్యలు : 6, 5, 8, 9

అనుకూలమైన రోజులు :  మంగళ, శుక్రవారాలు
పరిహారాలు : లక్ష్మీ ఆరాధన విశేషంగా చేయండి.

మిథునరాశి ఫలాలు:

మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1వ పాదం

ఆదాయం – 2, వ్యయం – 11, రాజపూజ్యం – 2, అవమానం – 4

 

మిశ్రమకాలం. ప్రణాళికాబద్ధంగా పని చేయడం, చేతులో ఉన్న పని మీద దృష్టిపెట్టి మానసిక వత్తిడి తగ్గించుకోవడం మంచిది. విశ్రాంతికి తగినంత సమయం కేటాయించుకోండి. ఖర్చులు పెరగడం ఆర్థికమైన వత్తిళ్ళు మరొక పక్క మీ మీద వత్తిడిని పెంచుతాయి. ఆర్థిక, వృత్తిపరమైన అంశాలలో  మిత్రుల సహాయ సహకారాలుంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల మీద దృష్టిపెట్టండి. దగ్గరవారి విషయంలో మాటలకన్నా పనులకు ఎక్కువ విలువ ఇవ్వడం అలవర్చుకోండి. కొత్త ఆదాయమార్గాలు పెరుగుతాయి. కాలం కలసి వస్తుంది.  శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది.

కుటుంబం 

ఈ సంవత్సరం ఈ రాశివారికి కుటుంబపరంగా సవాళ్లు ఎదురవుతాయి. కుటుంబంలోని అపార్థాలు, సమస్యలు, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మీ అమ్మ మాట వినండి. ఆవిడ సలహాలు, సూచనలు పాటించండి.  ఈ యేడాది రకరకాల కారణాలతో కుటుంబంతో గడిపే సమయం ఎక్కువగానే ఉంటుంది. అయితే దాన్ని ఆనందదాయకంగా మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంది. పరస్పర ఆరోపణలు, నిందల వల్ల ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువని గుర్తించండి. మాట తొందర వద్దు. దానివల్ల ఆత్మీయులతో కూడా వివాదాలకు అవకాశం ఏర్పడుతుంది.  సంతానం అభివృద్ధి విషయమైన ప్రణాళికలు వేస్తారు.  జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. ఎంతోకాలంగా కొనాలనుకుంటున్న వస్తువులను ఈ సంవత్సరం కొనే అవకాశం ఉంది.  సంవత్సరాంతానికి వృత్తి, వ్యాపారాలలో గుర్తించదగిన అభివృద్ధి, ఆదాయవృద్ధి ఉంటుంది. ఉద్యోగాలలో ఉన్నవారికి పదోన్నతులు లభిస్తాయి.

ఆరోగ్యం

మిధున రాశివారు ఈ ఏడాది  ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. వేళకాని వేళల్లో, ఇంటి బయట ఆహారం తీసుకోవడం తప్పనిసరి కావచ్చు, ఇది అనారోగ్యాలకు దారితీస్తుంది.  శ్రమ, ఒత్తిడి వల్ల కూడా అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల, విశ్రాంతి లేమి వల్ల  చర్మ రోగాలు  కలగవచ్చు . దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో నిర్లక్ష్యం వహించక వైద్యుణ్ణి సంప్రదించండి.  ప్రాణాయామం, యోగాసనాలు, ధ్యానం  వంటి వాటి ద్వారా శారీరక మానసిక వత్తిడిని నియంత్రించుకోండి, వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.

ఆర్థికం  

ఆర్థికపరంగా ఖర్చు కాలమనే చెప్పాలి. కుటుంబంలో అనుకోని ఖర్చుల వల్ల రుణాలు చేయవలసి వస్తుంది.  వ్యక్తిగతంగా కూడా ఖర్చుల మీద నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది.  ఆదాయాలు అనుకున్నంత సులువుగా సాధ్యం కావు.  సంపాదన పెరిగినా ఖర్చు అంతకు మించి పెరగడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. సంవత్సరం రెండోభాగంలో అంటే జులై నెల నుంచీ పరిస్థి్తులు కొంత మెరుగుపడతాయి.  ఆర్థిక సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి. కొత్త ఆదాయమార్గాలు అన్వేషణ ఫలిస్తుంది.

వృత్తి వ్యాపారాలు  

ఆశాజనకంగా ఉంటుంది. మొదట్లో సాధారణ ఫలితాలే కనిపించినా, అనేక కొత్త ఆలోచనలు, ప్రణాళికలు వేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పడుతుంది. తగినంత ఓర్పు అవసరం. ఓర్పుతో ప్రణాళికాబద్ధంగా నిర్వహించిన పనులు మీకు మంచి పేరు, ఆదాయం తెచ్చిపెడతాయి.  మీ ఆలోచలను పోటీదారులు సైతం మెచ్చుకుంటారు. తోటి ఉద్యోగులలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు చేస్తున్నవారు తాము చేస్తున్న వ్యాపారాన్ని మార్చి కొత్త వ్యాపారం చేసే అవకాశం ఉంది. విదేశాలతో వ్యాపారాలు చేసేవారికి అనుకూల సమయం కాదు.  షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభదాయక సమయం. లాటరీలు, జూదం వంటి వాటికి దూరంగా ఉండండి.

విద్యార్థులకు  : మిధున రాశి విద్యార్థులు కఠినంగా శ్రమిస్తేకానీ ఆశించిన ఫలితాలు దక్కవు.  హార్డ్ వర్క్‍తో పాటు స్మార్ట్ వర్క్ తప్పనిసరి. నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నిస్తే పోటీ పరీక్షలలో పాల్గొనే విద్యార్థులకు విజయావకాశాలు ఎక్కువగా  ఉన్నాయి.  సంవత్సరం రెండో భాగంలో మరిన్ని మంచి ఫలితాలకు అవకాశం ఉంది.

అదృష్ట సంఖ్యలు : 5, 1, 6, 7, 8

అనుకూలమైన రోజులు :  ఆది, శుక్ర, శని వారాలు
పరిహారాలు  : శ్రీలక్ష్మీసమేత విష్ణు ఆరాధన చేయండి.

కర్కాటకరాశి ఫలాలు:

పునర్వసు 2,3,4 పాదాలు, పుష్యమి, ఆశ్లేష

ఆదాయం – 11, వ్యయం – 8, రాజపూజ్యం – 5, అవమానం – 4

మీరు అనుకున్న పనులు పూర్తి చేయడానికి బంధుమిత్రులు కూడా ఇతోధికంగా సహకరిస్తారు. పాతపరిచయాలు, మర్చిపోయిన బంధుత్వాలు పునరుజ్జీవితమవుతాయి. కుటుంబ అవసరాల కోసం కొత్త వస్తువులు సమకూర్చుకుంటారు. నూతన గృహం, కొత్తవాహనాల కొనుగోలుకు కూడా అవకాశం ఉంది. తాత్కాలిక లాభాలను పక్కనపెట్టి దీర్ఘకాలికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. కేవలం అదృష్టం మీద ఆధారపడిన అంశాలలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. చాలా కాలంగా వాయిదాపడుతున్న పనులు ఈ యేడాది పూర్తవుతాయి. ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తే ఇతరులు ఈర్ష్య పడేస్థాయిలో విజయాలు సాధించడం సాధ్యమే.

కుటుంబం

కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సహకారం, సమన్వయం మెరుగుపడతాయి. వైవాహిక జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. జీవితభాగస్వామి నుంచీ, సంతానం నుంచీ పూర్తి స్థాయి తోడ్పాటు లభిస్తుంది. ఈ విషయంలో సంతానం ఆర్థికంగా సహకరిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న మీ సంతానానికి కొత్త ఉద్యోగం లభించవచ్చు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు మంచి అవకాశాలున్నాయి. దీనివల్ల కుటుంబపరమైన ఖర్చులు పెరుగుతాయి.  జీవిత భాగస్వామి కోసం, సహోదరుల కోసం కూడా ధనం ఖర్చు చేయాల్సి రావచ్చు.

ఆర్థికం  

ఈ సంవత్సరం సాధారణ ఆదాయం స్థిరంగా ఉంటుంది. కానీ అదనపు ఆదాయాలు అందీ అందనట్లుగా ఉంటాయి.  అదనపు ఆదాయాలకై అన్వేషణ అశాంతిని పెంచుతుంది.  కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తూనే, ఖర్చులను నియంత్రించుకొనేందుకు గట్టిగా ప్రయత్నించాలి. ఉద్యోగాలలో ఉన్న వారికి జులై తర్వాత పదోన్నతులు, ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉంది. నవంబరు-డిసెంబరునాటికి ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. ఇంతకు ముందు మీరు పెట్టిన పెట్టుబడులు లాభాలనిస్తాయి. కొత్తగా అప్పులు ఇవ్వడం, పెట్టుబడులు పెట్టడం విషయంలో ఆచితూచి వ్యవహరించండి.

ఆరోగ్యం

ఆరోగ్యపరంగా  బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.  ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది.  మానసిక ప్రశాంతి కూడా ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తారు.  విహారయాత్రలు చేసే అవకాశం,  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంది.

వృత్తి వ్యాపారాలు

వృత్తి ఉద్యోగాల పరంగా  2017వ సంవత్సరం సవాళ్లను విసురుతుంది. మీ సామర్థ్యానికి పరీక్ష పెడుతుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పనులన్నీ మందకొడిగా నడుస్తాయి. పనికి తగ్గ ఫలితం లభించడం లేదనే ఆవేదన కలుగుతుంది. ఏప్రిల్లో వృత్తి ఉద్యోగాలలో మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. మాట తొందర వద్దు, అధికారులతో, తోటి ఉద్యోగులతో సామరస్యంగా వ్యవహరించండి. ఊహించని చోటికి బదిలీలు జరగవచ్చు. జులై నుంచి పరిస్థితులలో సానుకూల మార్పు వస్తుంది. వ్యాపారాలలో ఉన్న వారికి ఈ యేడాది సానుకూలంగానే ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యాలలో ముఖ్యంగా కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. గుడ్డిగా నమ్మి పెట్టుబడులు పెట్టకండి. లావాదేవీల విషయంలో ఎప్పటికప్పుడు శ్రద్ధగా లెక్క చూసుకోండి.

విద్యార్థులకు

ఈ సంవత్సరం చాలా బాగుంది. అవసరమైన సమయాల్లో చక్కటి ఏకాగ్రత సాధ్యపడుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. చదువుకు ఎక్కువ సమయాన్ని కేటాయించడం ద్వారా పోటీ పరీక్షలలో విజయాలు అందుకోవచ్చు. ఉన్నత విద్యలో ఉన్నవారికి, పరిశోధకులకు అదృష్టం కలసి వస్తుంది. సులువుగా సానుకూల ఫలితాలు సాధిస్తారు. సాహిత్యం, భాషా రంగాలలో విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. వైద్య విద్య, ఇంజనీరింగ్ విద్యార్థులు కష్టపడి చదువవలసి ఉంటుంది. ప్రభుత్వ రంగ పరీక్షలు విజయవంతమవుతాయి. మొత్తం మీద ఈ యేడాది పరీక్షలలో ఊహించని సానుకూల ఫలితాలు వస్తాయి. సరైన కృషితో అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

అదృష్ట సంఖ్య : 2

అనుకూలమైన రోజులు :  మంగళ, శుక్రవారాలు
పరిహారాలు : శివారాధన చేయండి.

సింహరాశి ఫలాలు:

మఖ 4వ పాదం, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం

ఆదాయం : 14      వ్యయం : 2              రాజపూజ్యం : 1      అవమానం : 7

శుభయోగాలున్నాయి. సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగుంటుంది. మీ నిర్వహణాసామర్థ్యానికి ప్రణాళికాబద్ధమైన కృషిని జోడించి విజయాలను అందుకోండి. ఆర్థిక విజయాల వల్ల వ్యాపార రంగంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది. ప్రిత్రార్జిత ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు పరిష్కారమవుతాయి. తండ్రి నుంచి, గురువుల నుంచి బంధువుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు తగినంతగా లభిస్తాయి. ఆహారం, విహారాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కుటుంబం

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ సామర్థ్యానికీ, అనుభవానికీ తగిన అవకాశాలు లభిస్తాయి. లాభాలను ఆర్జించగలరు. మీ నిర్వహణాసామర్థ్యానికి ప్రణాళికాబద్ధమైన కృషిని జోడించి విజయాలను అందుకోండి. సింహరాశి వారికి ఈ సంవత్సరం కుటుంబపరంగా బాగుంటుంది. విందులు, వినోదాలు కొరకై ధనం అధికంగా ఖర్చు చేస్తారు.  జీవిత భాగస్వామితో అనవసర వాగ్వివాదాలకు దిగవద్దు. వివాహబంధంలోనికి అహంకారాన్ని రానివ్వకండి. మీ మనస్పర్థలను సొమ్ము చేసుకొని లబ్ది పొందాలనుకొనేవారికి చేతులారా అవకాశం ఇచ్చినవారవుతారు.

ఆరోగ్యం

ఈ సంవత్సరం మీ ఆరోగ్యం బాగుంటుంది. గత కొంత కాలంగా బాధిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.మానసికశాంతి లభిస్తుంది.  బంధువుల రాకపోకల వల్ల విశ్రాంతి కరువవుతుంది. మీ శరీరం ధృఢంగానే ఉన్నా రుతుసంబంధ వ్యాధులు, పనివత్తిడి వల్ల వచ్చే వ్యాధులు ఇబ్బందిపెడతాయి.

ఆర్థికం 

ఈ సంవత్సరం ఆదాయం బాగుంటుంది. మీరు చెల్లించాల్సిన బాకీలు చెల్లిస్తారు. చాలా కాలం నుంచి మీకు రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. ఆ డబ్బుతో మీ వ్యాపారాభివృద్ధికీ, కొత్త వ్యాపారాల ప్రారంభానికీ యోచనలు చేస్తారు. ఆర్థిక విజయాల వల్ల వ్యాపార రంగంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది.  వృత్తి, ఉద్యోగాలలో వారికి కూడా ఈ సంవత్సరం ఆశించిన అభివృద్ధి, ఆదాయం ఉంటాయి.

వృత్తి వ్యాపారాలు 

ఉద్యోగస్తులకు  ఈ సంవత్సరం వారి సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. ఆదాయం బాగుంటుంది. గతంలో వాయిదాపడిన పనులు తిరిగి కొనసాగిస్తారు.  వ్యాపార వృద్ధి, విస్తరణ ఉంటాయి. శత్రువులు మిమ్మల్ని ఎదుర్కొనేందుకు భయపడతారు. బదిలీలు ఉన్నా అవి అనుకూలంగానే ఉంటాయి. పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి.   స్థిరాస్థి వ్యాపారంలో ఉన్నవారు మాత్రం ఎక్కువ శ్రమపడవలసి వస్తుంది.

విద్యార్థులకు

సింహరాశి విద్యార్థులు ఈ సంవత్సరం ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఏకాగ్రత ఉంటే కానీ అనుకున్న పనులు పూర్తికావు.  ఉన్నత విద్యలో ఉన్నవారికి బాగుంటుంది. ఉపాధ్యాయుల సలహాలు అవసరానికి ఉపయోగపడతాయి. విదేశాలకు వెళ్లాలని ఆశిస్తున్న విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి.  బ్యాంకింగ్, మేనేజ్ మెంట్ రంగాల విద్యార్థులకు  సానుకూల సమయం. ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

అదృష్ట సంఖ్యలు : 1, 2, 3, 5, 9

అనుకూలమైన రోజులు : ఆది, మంగళ, గురువారాలు
పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.

కన్యారాశి ఫలాలు:

ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు

ఆదాయం : 2           వ్యయం : 11           రాజపూజ్యం : 4      అవమానం : 7

 

మీ సామర్థ్యానికి  మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రణాళికా బద్ధంగా వ్యవహరించడం అవసరం. అత్యవసర వ్యయాలకు తగిన సంసిద్ధతతో ఉండటం మంచిది.   కుటుంబంలో పెద్దల అనారోగ్యం కూడా మీ మీద మానసిక, శారీరక ఒత్తిడి పెంచి, అశాంతికి కారణమవుతుంది. ఇతరులను నొప్పించకుండా మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం సాధన చేయండి. చేతులో ఉన్నపని మీద దృష్టి నిలిపి దాన్ని పూర్తిచేయడానికే శక్తియుక్తులు కేటాయించండి. ఇతరులను నమ్మి మీరు మాట ఇవ్వవద్దు. వాహనాలు నడిపేటప్పుడు, యంత్రపరికరాలతో పని చేసేటప్పుడు అశ్రద్ధ పరాకు వద్దు. అదృష్టం మీద ఆధారపడకుండా తర్కం మీద, కృషి మీద ఆధారపడి వ్యాపార అంచనాలు వేసుకోవడం చాలామంచిది.

కుటుంబం

కన్యారాశివారి కుటుంబ జీవనం ఒడిదుడుకులమయంగా ఉంటుంది. మీ ఆలోచనలలో అస్పష్టత, మనసులో అనిశ్చితి  వల్ల మీ వైఖరి, ప్రవర్తన పట్ల జీవితభాగస్వామి, సన్నిహితులు అయోమయంలో ఉంటారు,  అసంతృప్తి చెందుతారు. సామాజిక సంబంధాలలో కూడా ఈ అస్పష్టత వల్ల వచ్చే అయోమయం, అసహనం ప్రభావం ఉంటుంది. ఇంటికోసం కొన్ని ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు, సామాజిక కార్యకలాపాలలో క్రియాశీలంగా పాలుపంచుకుంటారు.

ఆరోగ్యం

కన్యారాశివారి  ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మానసిక శారీరక వత్తిడి ప్రభావం ఆరోగ్యం మీద ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల పట్ల, రుతుసంబంధ అనారోగ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వైద్యసేవలు అవసరం అవుతాయి. నిద్రలేమి, అశాంతి వెన్నాడతాయి. సాధ్యమైనంత వరకూ సమయానికి ఆహారం తీసుకోవడం, వ్యాయామం, ధ్యానం చేయడం  వంటి జాగ్రత్తలతో అనారోగ్యాలు శృతి మించకుండా చూసుకోండి.

ఆర్థికం

ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయాల కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న ఆదాయాలు, అనుకున్నంత వేగంగా చేతికి అందవు. అప్పులు తిరిగి వసూలు కావడానికి చాలా కష్టపడాలి. విలాసవంతమైన వస్తువుల ఖరీదు మీద, ఆకస్మిక ధనలాభాల మీద ఆకర్షణ పెంచుకోకుండా ఉండాలి.

వృత్తి వ్యాపారాలు 

ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి.  తగిన పదోన్నతులు పొందుతారు. వేతనపరంగా కూడా వృద్ధి ఉంటుంది. సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారరంగంలో వారికి కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. అంచనాలకు మించి శ్రమిస్తేకానీ, అనుకున్న ఫలితాలు చేతికి అందవు. వ్యాపార కార్యాల నిర్వహణ కోసం ప్రయాణాలు తప్పవు. జులై తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. యేడాది చివరకు మీ అంచనాలను అందుకుంటారు.

విద్యార్థులకు

కన్యారాశి విద్యార్థులు చాలా క్రమశిక్షణతో మెలగాలి. కష్టపడితే కానీ  చదువులలో ఆశించిన అభివృద్ధి అందుకోలేరు. చదువు మీద నుంచి మనసును మళ్ళించే అంశాలు ఎక్కువవుతాయి. దీనివల్ల మానసిక ఆందోళన, దాని వల్ల అశ్రద్ధ పెరుగుతాయి. ఉన్నత విద్య విషయంలో ఆలోచించి, నిపుణుల సహాయంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్ధాష్టమశని విద్యార్థుల  ఆరోగ్యం మీద ప్రతికూల  ప్రభావం చూపే అవకాశం ఉంది. దానివల్ల  చదువు కుంటుపడవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల సాధనలోనూ, పోటీ పరీక్షలకు సిద్ధం కావడంలోనూ తొందరపాటు లేకుండా ఉంటే మంచిది.

అదృష్ట సంఖ్యలు : 5, 1, 3, 4, 6

అనుకూలమైన రోజులు : ఆది, శుక్ర, సోమ వారాలు
పరిహారాలు : విష్ణుపూజ చేయండి.

తులారాశి ఫలాలు:

చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1వ పాదం

ఆదాయం : 2  వ్యయం : 8  
రాజపూజ్యం : 1 అవమానం : 5

 

మిశ్రమ ఫలితాలున్నాయి. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో హోదా, పరపతి పెరుగుతాయి. ప్రత్యర్ధులపై పైచేయి సాధిస్తారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్టులు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.  అకారణ కలహాలు, అనుకోని వైరాలు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తాయి.  ఆధ్యాత్మిక రంగంలో మీకు సాంత్వన లభిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాహయోగం, సంతానప్రాప్తి ఉంది. మీ ఊహలకు తగినంతగా గుర్తింపు లభించకపోయినా కలత చెందరు. గతంతో పోల్చితే మీ ప్రయోజనాలు కొంతవరకు నెరవేరడంతో ఈ సంవత్సరం మీ మనసుకు సర్దిచెప్పుకోగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు కలిసివస్తాయి.  నూతన ఉద్యోగప్రాప్తితో ఈ ఏడాది మీ జీవితం కొత్తగా మారిపోతుంది. మీ చుట్టూ అవకాశాలు తెరుచుకుంటాయి. వెతికిపట్టుకునే చొరవ చూపెట్టండి. అదేసమయంలో ఉద్వేగాలకు, ఉద్విగ్నతలకు దూరంగా ఉండండి. ఉగాది పండుగ తర్వాత మరింత మెరుగైన ఫలితాలు సాధించగలుగుతారు.

కుటుంబం

ఆత్మీయుల ఆరోగ్యం కలత పరుస్తుంది. వాదోపవాదాలు చోటుచేసుకుంటాయి. బంధువుల మధ్య కలహాలు దూరాన్ని పెంచుతాయి. కుటుంబ బాధ్యతల్లో ఒత్తిళ్లుంటాయి. భార్య లేదా భర్తతో ఎక్కువకాలం గడిపే సమయం చిక్కదు. బాధ్యతలు పంచుకోవడం, సర్దుకుపోవడం అలవరుచుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహరాల్లో ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చు. అకారణ కలహాలు సంభవించవచ్చు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ సందర్భాల్లో మౌనంగా ఉండడం శ్రేయస్కరం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.

ఆరోగ్యం

ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. పని ఒత్తిడి, శ్రమాధిక్యత మిమ్మల్ని అలసటకు గురిచేస్తాయి. వాతావరణ మార్పుల వల్ల వచ్చే చిన్నపాటి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. కీళ్లనొప్పులు బాధిస్తాయి. నేత్ర సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

వృత్తి వ్యాపారాలు

ఉద్యోగులకు యోగదాయకమైన కాలం. పదోన్నతితో కూడిన బదిలీకి అవకాశం ఉంది.  వ్యాపారంలో ప్రత్యర్ధులపై మీదే పైచేయిగా ఉంటుంది. కమీషన్ వ్యాపారులకు కలిసొచ్చే కాలమిది. నూతనంగా ప్రారంభించే చిన్నతరహా వ్యాపారం ప్రారంభంలోనే మంచిలాభాలు పుంజుకుంటుంది. పారిశ్రామిక వేత్తలు ఆచితూచి అడుగు ముందుకువేయాలి. సంవత్సరం రెండోభాగంలో అన్ని తరహాల వ్యాపారాలు లాభాలబాట పడతాయి.

ఆర్ధికం

ఆర్ధికంగా మంచి పురోగతి ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్ధిక స్వావలంబన కోసం మీరు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. దూరప్రాంతాల నుంచి అందవలసిన డబ్బు మీ చేతికి అందుతుంది.

విద్యార్ధులకు

ఏడాదంతా శ్రమించి చదవాలి. పెద్దల సూచనలు, సలహాలు ఉపయోగపడతాయి. సంవత్సరం ద్వితీయార్ధంలో విద్యలో పురోగతి సాధిస్తారు. విదేశీ విద్యాప్రయత్నాలు ఫలిస్తాయి.

అదృష్ట సంఖ్యలు : 6, 2, 7, 9

అనుకూలమైన రోజులు : సోమ, శుక్ర, శనివారాలు
పరిహారాలు : కాలభైరవాష్టకం నిత్యం పఠించాలి.

వృశ్చికరాశి ఫలాలు:

 

విశాఖ : 4వ పాదం, అనూరాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు

ఆదాయం : 5           వ్యయం : 5              రాజపూజ్యం : 3      అవమానం : 2

ఈ సంవత్సరం ఉత్సాహంగా గడిస్తుంది. శుభకార్యాలకు సొమ్ము వెచ్చించాల్సి ఉంటుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఒక ముఖ్యమైన పనిని సాధించి పూర్తిచేస్తారు. జూన్, జులైల కాలంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. వచ్చిన అవకాశాలను అప్రమత్తతతో అవకాశాలను అందిపుచ్చుకోవాలి. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి, మొండి బకాయిలు వసూలవుతాయి. సామర్థ్యంతో చేపట్టిన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఈ సంవత్సరం అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది.

కుటుంబం

మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. అత్తవారి వైపు నుంచి కూడా సహాయ, సహకారాలు అందుతాయి. ఆకస్మికంగా శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. మీ జీవిత భాగస్వామి నుండి విలువైన బహుమతులను ఆశిస్తారు. అనవసరమైన మాటల వల్ల భార్యాభర్తల  మధ్య  అపార్థాలు వచ్చే అవకాశం ఉంది.

ఆరోగ్యం

వృశ్చిక రాశి వారికి ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది. ప్రయాణాలు లేదా పని ఒత్తిడులు మిమ్మల్ని అలసటకు గురిచేస్తాయి.  ప్రణాళికాబద్ధంగా పనులు చేసి, మానసిక వత్తిడి నుంచి బయటపడాలి. శారీరక శ్రమ, విశ్రాంతి లేమి వల్ల అజీర్ణం, నిస్సత్తువ తలెత్తవచ్చు, ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలతో ఈ సమస్యలను ఎదుర్కోండి.    జులై నుంచీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఆర్థికం

ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వృశ్చిక రాశివారికి ఈ యేడాది మంచి అనుకూల సమయం. అధికారంలో ఉన్న వ్యక్తులు  మీకు ఆర్థికంగా సహకరిస్తారు. ఖర్చులు కూడా ఆదాయంతో పాటు పెరుగుతాయి. విచక్షణతో వ్యవహరిస్తే  లాభాలు గడించడం సాధ్యమే.

వృత్తి వ్యాపారాలు 

కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి జనవరి నెల అనుకూల సమయం. మీకు మానసికంగా ఉత్సాహం, ధైర్యం పుష్కలంగా ఉంటాయి. ఎన్నో లాభదాయక అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వ్యాపార వృద్ధి, విస్తరణ రెండూ సాధ్యమవుతాయి. వ్యాపారాభివృద్ధికి మిత్రులు, అధికారుల  సహాయ సహకారాలు లభిస్తాయి. దూరప్రాంతాలకు కూడా వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కూడా అభివృద్ధిదాయకంగా ఉంటుంది.

విద్యార్థులకు

వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. శక్తి యుక్తులు  ఉపయోగించి అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. పుష్కలంగా ఉన్నత విద్యావకాశాలు  లభిస్తాయి. పరిశోధన రంగంలోని విద్యార్థుల ప్రతిభకు మంచి గుర్తింపు పొందుతారు. పోటీ పరీక్షలలో కూడా ఎక్కువ శ్రమ తర్వాత విజయం సాధిస్తారు.

అదృష్ట సంఖ్యలు : 9, 1, 2, 3

అనుకూలమైన రోజులు :  ఆది, సోమ, గురువారాలు
పరిహారాలు : లక్ష్మీదేవిని ఆరాధించండి.

ధనూరాశి ఫలాలు:

మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం

ఆదాయం   : 8         వ్యయం : 11           రాజపూజ్యం : 6      అవమానం : 3

ఈ యేడాది మీకు సానుకూలంగా ఉంటుంది. ధార్మిక విషయాల్లోను యజ్ఞయాగాదుల్లోను చురుకుగా పాల్గొంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన కొత్త వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. మీ సంగీతాభిరుచిని మెరుగుపరుచుకుంటారు. యోగాభ్యాసం, ధ్యానం మీకు రొటీన్ కార్యకలాపాలనుంచి విశ్రాంతినిస్తాయి. పొదుపు మీద దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించుకోవాలి. సొమ్ము లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మొత్తం మీద సమయం అనుకూలంగానే ఉన్నా ఆర్థిక సమతౌల్యత సాధించేందుకు కష్టించక తప్పదు. నిలిచిపోయిన ధనం చేతికి అందుతుంది.  కొత్త వ్యాపారాలు ప్రారంభించే ముందు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి.

కుటుంబం

గతంలో ఏర్పడిన కలతలు సమసిపోతాయి.  గృహోపకరణాల కొనుగోలు, శుభకార్య నిర్వహణ చేస్తారు. వారసత్వ ఆస్తి వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. తల్లిదండ్రుల అండదండలు లభిస్తాయి. సంతానాభివృద్ధి ఆనందాన్నిస్తుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు.  వినోదయాత్రలు చేస్తారు. బయట కార్యకలాపాలు పెరగడం వల్ల  వైవాహిక జీవితానికి తగిన సమయం కేటాయించలేకపోతారు. దీనివల్ల భార్యాభర్తల మధ్య కోపతాపాలు, గొడవలు తలెత్తవచ్చు. మాటతొందర లేకుండా సంయమనంతో వ్యవహరించండి.

ఆరోగ్యం

ఆరోగ్య విషయంగా అప్రమత్తంగా ఉండాలి. ఆలస్యంగా భోజనాలు చేయడం వల్ల జీర్ణకోశ సంబంధ వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయడానికి తీరిక కల్పించుకోకపోతే ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉంది. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం ఉన్నవారు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధగా ఉండాలి.

ఆర్థికం

ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ప్రారంభమైనా అనుకూలంగా ముగుస్తుంది. జనవరి నెలలో  ఆర్థికంగా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఉన్నతాధికారుల వల్ల ఆర్థిక లాభాలు పొందుతారు. వ్యాపారరంగంలో వారికి ఆర్థిక వృద్ధి లాభాలు ఉంటాయి. వృత్తులలో ప్రయాణాలు, ప్రయాణ సంబంధ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అయినా ఈ యేడాది ఆదాయం లాభదాయకంగానే ఉంటుంది.

వృత్తి వ్యాపారాలు 

ఉద్యోగ రంగంలో ఉన్న ధనస్సు రాశివారికి ఈ యేడాది శుభదాయకంగా ఉంటుంది. ఉన్నతాధికారుల సహాయ సహకారాలు,  పదోన్నతులు లభిస్తాయి. జీతభత్యాలు పెరుగుతాయి. ఉద్యోగంలో సౌకర్యాలు సమకూరుతాయి. వ్యాపారాలలో ఉన్న వారికి కూడా అనుకూల సమయం.  ప్రభుత్వపరమైన లేదా ప్రైవేటు రంగాల నుండి మంచి ప్రాజెక్టులు లభిస్తాయి. నిపుణులు, అనుభవజ్ఞుల సలహాలు పాటించడం మంచిది. భాగస్వాములతో వాదనలకు దిగకండి, సత్ఫలితాలుంటాయి. స్థిరాస్తి వ్యాపారులకు కూడా లాభాలు లభించే అవకాశం ఉంది.

విద్యార్థులకు

ఈ యేడాది విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది.  విద్యాసంస్థలలో వాతావరణం చాలాఆహ్లాదకరంగా ఉంటుంది. చదువు మీద ఆసక్తి, ఉత్సాహం పెరుగుతాయి, పరిశీలనాశక్తి ఇనుమడిస్తుంది. మీరు కోరుకున్న ఉన్నత విద్యాలయాలలో సీట్లు లభిస్తాయి. పోటీపరీక్షలు రాసే విద్యార్థులు మరింత అప్రమత్తంగా పరీక్షలకు సిద్ధం కావాలి.

అదృష్ట సంఖ్యలు : 1, 2, 4, 5

అనుకూలమైన రోజులు : ఆది, బుధ, గురు వారాలు
పరిహారాలు : విష్ణు ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు:

ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1,2 పాదాలు

ఆదాయం  : 11       వ్యయం : 5              రాజపూజ్యం : 2      అవమానం : 6

అనుకోని అవకాశాలు కలసి వస్తాయి.  ఆదాయం పెరిగినా ఖర్చులపై  అదుపు ఉండదు, వద్దు వద్దు అనుకుంటూనే అనవసరపు ఖర్చులు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రయాణాలు, పనుల వత్తిడి వలన అలసట తప్పదు. విశ్రాంతి కోసం ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి. యోగా, ధ్యానాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వండి. ఒకేసారి ఎక్కువ విషయాల్లో తల పెట్టడం మంచిది కాదు. మీరు ఇతరులకు ఇచ్చిన చేబదుళ్ళు అనుకున్న సమయానికి తిరిగివస్తాయి. డబ్బు లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలలో బంధాలను, అనుబంధాలను పక్కకు పెట్టి నిర్ణయాలు తీసుకోండి.

కుటుంబం

సాధారణ వాతావరణం నెలకొంటుంది. ఒక పక్క సంతోషం, మరొక పక్క వివాదాలు రెండిటికీ అవకాశం ఉంది. మాట తొందర అనవసర  వివాదాలు తగ్గించుకోవాలి. అనవసర ఆలోచనల వల్ల మనశ్శాంతి కరువవడం తప్ప ఉపయోగం లేదని గుర్తించండి.  తల్లిదండ్రుల ఆరోగ్యం,  వారితో సంబంధాలు మెరుగవుతాయి. జీవిత భాగస్వామి సంతోషం కోసం ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. సంతానాభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు.

ఆరోగ్యం

ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం కష్టకాలమే.  మానసిక వత్తిడి, ఆహారం తగిన సమయానికి తీసుకోలేక పోవడం వల్ల జీర్ణ సంబంధమైన, చర్మ సంబంధమైన అనారోగ్యాలకు అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి.   ఆరోగ్యకరమైన వాతావరణంలో సమయానికి ఆహారం తీసుకొనే ప్రయత్నం చేయండి.

ఆర్థికం

ఈ సంవత్సరం సాధారణ ఫలితాలుంటాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో అనేక విధాలుగా ఆదాయం కలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాల వల్ల కూడా  ధనలాభం ఉంటుంది. జూన్, జులై తర్వాత మిశ్రమ ఫలితాలుంటాయి. ఆలోచించకుండా పెద్ద మొత్తాలలో పెట్టుబడులు పెట్టకండి.

వృత్తి వ్యాపారాలు

ఉద్యోగరంగంలోని వారికి మంచి ప్రోత్సాహకరమైన సమయం. మీ సామర్థ్యం పోటీదారులను ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది. శత్రువుల దురాలోచనలను పసిగట్టడంలో మీకు అదృష్టం కలసి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి, పై అధికారి వల్ల ఆర్థిక లాభం గౌరవం లభిస్తాయి.   వ్యాపార రంగంలోని వారు తమ వ్యాపారాలను లాభదాయకంగా విస్తరిస్తారు.   షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ కలసి వస్తాయి.

విద్యార్థులకు

ఈ సంవత్సరం విద్యార్థులకు సానుకూల సమయం. విద్యార్థుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అనుకున్న సమయానికి ప్రాజెక్టు వర్కులు పూర్తి చేయగలుగుతారు.  చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది. శ్రద్ధ పెరుగుతుంది. వినోద కాలక్షేపాలలో కాలహరణం చేయవద్దు. ఉన్నత స్థాయి విజయాలు ఆసక్తి, తెలివితేటలు మాత్రమే సరిపోవనీ, ప్రణాళికా బద్ధమైన పరిశ్రమ అవసరమనీ గుర్తించండి.

అదృష్ట సంఖ్యలు : 8, 3, 4, 5, 9

అనుకూలమైన రోజులు :  సోమ, మంగళ, శుక్రవారాలు
పరిహారాలు : శనైశ్చరునికి జపదానాలు నిర్వహించండి.

కుంభరాశి ఫలాలు:

ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఆదాయం : 11        వ్యయం : 5              రాజపూజ్యం : 5      అవమానం : 6

ఈ సంవత్సరం మీ ఆర్థికస్థితి బాగుండడంతో ఈ సంవత్సరం మీకు యోగదాయకమైన కాలం. ఆర్థికపరమైన ప్రయాణాలు లాభిస్తాయి.  అయినా అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడం, అవసరం మేరకే ధనాన్ని వెచ్చించి పొదుపు చేయడం తప్పనిసరి.  పనులు చేయడంలో కొత్త ఉత్సాహం చూపిస్తారు. కొత్త ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. వాతావరణం సంతోషదాయకంగా ఉన్నా అధికంగా ఖర్చు చేయక తప్పదు. వారసత్వ ఆస్తుల వివాదాలు పరిష్కరించబడతాయి. యోగాభ్యాసం, ప్రాణాయామం వంటివి సాధన చేయాలి. పనిఒత్తిడి నుంచి దూరం జరుగుతూ శరీరానికి తగినంత విశ్రాంతి నివ్వడం మంచిది. పెట్టుబడులు, అనుబంధాల విషయంలో మీ విచక్షణ మీదే ఆధారపడి, మనసు చెప్పిన మాట విని ముందుకు సాగండి.

కుటుంబం

గతంతో పోల్చితే పరిస్థితులు  మెరుగుపడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. విందు వినోదాల కోసం ఖర్చులు అధికంగా చేస్తారు. కొత్త పనులు ప్రారంభించే ముందు పెద్దల సలహాలు తీసుకొని ఆచరించడం శుభకరంగా ఉంటుంది.

ఆరోగ్యం

ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది.  శారీరకంగా శక్తివంతంగానే ఉన్నా, మానసిక అలసట బద్ధకం ఉంటాయి. దీనివల్ల  ఆస్తమా, ఎలర్జీ  వంటి జబ్బులున్నవారు అప్రమత్తంగా ఉండాలి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొనే ప్రయత్నాలు చేయాలి. చిన్న అనారోగ్యాన్ని కూడా  నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. జలుబు, దగ్గు వీటిని సైతం నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఆర్థికం

ఆర్థిక లావాదేవీలలో చాలా కాలంగా వేధిస్తున్న వివాదాలను పరిష్కరించుకొంటారు. జూన్, జులై నాటికి ఇంతకు ముందు వివిధ కారణాలతో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించగలుగుతారు. ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న ఆదాయం ఈ యేడాది చేతికి అందుతుంది. ఊహించని కొత్త మార్గాలలో ఆదాయం ఆర్జించగలుగుతారు.  సమస్యాత్మక విషయాలలో పెట్టుబడులు పెట్టేముందు తగిన జాగ్రత్తలు తీసుకోండి.

వృత్తి వ్యాపారాలు

ఉద్యోగస్తులకు ఈ యేడాది కలసి వస్తుంది. మీ సామర్థ్యం మీ అధికారుల మన్ననలను చూరగొంటుంది. పై అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి, పరపతి పెరుగుతుంది.   ఉద్యోగంలో ఆశించిన పదోన్నతులు లభిస్తాయి. అదనపు బాధ్యతలు కేటాయించబడతాయి. కార్యాలయాల్లో మీ గౌరవం ఇనుమడిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల కోసం  ప్రయాణాలు చేయవలసి వస్తుంది.   నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారులకు కూడా కాలం కలసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ధనాన్ని పొదుపు చేస్తారు.  జూన్, జులైల తర్వాత వ్యాపారంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు.

విద్యార్థులకు

కుంభ రాశి విద్యార్థులను ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలుంటాయి. చదివిన అంశాలనే మళ్లీమళ్లీ నెమరు వేసుకోవడం ద్వారా ఉన్నతమైన ఫలితాలు పొందాలి. సంవత్సరాంతానికి అనుకున్న పరీక్షల్లో ఘనవిజయాన్ని సాధించే అవకాశాలున్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకొనేవారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. పోటీపరీక్షల్లో సానుకూల ఫలితాలుంటాయి.

అదృష్ట సంఖ్యలు : 4, 8

అనుకూలమైన రోజులు : శుక్ర, శనివారాలు
పరిహారాలు : హనుమంతుని ఆరాధించండి.

మీనరాశి ఫలాలు:

పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు

ఆదాయం  : 8       వ్యయం : 11           రాజపూజ్యం : 1     అవమానం : 2

కుటుంబంలో శుభకార్యాలు, ధార్మిక కార్యాలు నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త వాహనం లేదా ఇల్లు కొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.   తీర్థయాత్రలవల్ల మానసికశాంతిని పొందవచ్చు. కుటుంబసభ్యులకు సమయం కేటాయించడం, వారితో మీ సమస్యలను చర్చించడం ద్వారా వారిని మీ సమస్యలలో భాగస్వా్ములను చేయండి. దానివల్ల మానసిక సాంత్వన లభించి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అదృష్టం మీద ఆధారపడిన పెట్టుబడులకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. అప్పులు ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించండి.

కుటుంబం

కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు రావచ్చు. శాంతిని, సామరస్యాన్ని కాపాడటానికి సహనంతో కృషి చేయాలి.  అందరి అభిప్రాయాలనూ గౌరవించడం,  అనవసరపు వాదనలు పెంచుకోకుండా మధ్యే మార్గాన్ని అన్వేషించడం  మంచిది. జీవిత భాగస్వామితో కలసి ప్రయాణాలు, యాత్రలు చేసే అవకాశం, వారి  నుంచి ఖరీదైన బహుమతిని పొందే అవకాశం ఉన్నా్యి. సంతానం యొక్క అభివృద్ధి సంతృప్తి కరంగా ఉంటుంది.

ఆరోగ్యం

ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మానసిక వత్తిడి వల్ల వచ్చే అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి.  బీపీ, సుగర్ వ్యాధులతో బాధపడుతున్న వారు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధగా ఉండాలి.  ప్రతికూల భావనలకు దూరంగా ఉండండి.  ధ్యానం, యోగాభ్యాసం సాధన చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను, సానుకూల భావనలను మెరుగు పరుచుకోండి.

ఆర్థికం

ఆర్ధికపరంగా సాధారణంగా ఉంటుంది. జూన్, జులై నాటికి ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. వర్తక, వ్యాపారాల్లో ఉన్న వారి అవసరాలను కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు ఆదుకుంటారు. ఇప్పటికే పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. నవంబరు, డిసెంబరు నాటికి పరిస్థి్తులు మెరుగుపడతాయి. అభివృద్ధి కనిపిస్తుంది.

వృత్తి వ్యాపారాలు

వృత్తిపరంగా సవాళ్లు ఎదురవుతాయి. పట్టుదల, కఠోర పరిశ్రమతో వాటిని అధిగమిస్తారు.  ఉద్యోగాలలో మార్పు కోరేవారు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. జూన్, జులై నెలల నుంచి పదోన్నతులు లభిస్తాయి.  వృత్తిలో హోదా, గౌరవం పెరుగుతుంది. సహోద్యోగులతో సామరస్యం మెరుగుపడుతుంది.  పదోన్నతి మూలంగా  బహుమతులు, అధికారుల మన్ననలను పొందుతారు. వ్యాపార రంగంలో వారికి తమ  పెట్టుబడికి, శ్రమకు తగిన లాభాలు లభిస్తాయి. చాలా కాలంగా పరిష్కారం కాని వ్యాపార సమస్యలు పరిష్కారమవుతాయి.  దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తారు. తొందరపడి నూతన వ్యాపారాలు ప్రారంభించవద్దు.

విద్యార్థులకు

మీన రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. చదువుల పట్ల శ్రద్ధ ఎక్కువ కనబరుస్తారు. మీ ఉపాధ్యాయుల నుంచి మంచి సహాయ సహకారాలు అందుతాయి. జూన్, జులై నాటికి మీకు నచ్చిన సబ్జెక్టులు అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. విదేశీ అవకాశాలు కలిసివస్తాయి.

అదృష్ట సంఖ్యలు : 3, 7

అనుకూలమైన రోజులు : ఆది, సోమ, గురువారాలు
పరిహారాలు : విష్ణుమూర్తిని పూజించండి.