త్వరలో కరెన్సీ కష్టాలు మాయం..

214

పెద్ద నోట్లు రద్దయి 50 రోజులు దాటినా  ఇంతవరకు ప్రజలకు  సరిపడ డబ్బు అందుబాటులోకి రాలేదు. బ్యాంకులు, అర కొర పనిచేసే ఏటీఎంలలో 2 వేల నోట్లు మాత్రమే లభ్యమవడంతో చిల్లర కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి.  అయితే నగదు విషయంతో సాధారణ పరిస్థితులు మరికొంత సమయం పట్టవచ్చని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఎస్‌‑బీఐ చైర్మన్‌ అరుంధతి భట్టాచార్య శుభవార్త చెప్పారు. పెద్ద నోట్ల తరువాత ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు తీరుతాయని ప్రకటించారు.  ఫిబ్రవరి నెలాఖరుకల్లా ప్రజలకు డబ్బు కష్టాలు తీరతాయన్నారు. ఎస్ బీ ఐ ఖాతాదారులు క్యూలో ఉండే పరిస్థితి ఉండదని హామీ ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. సరిపడ కరెన్సీ అందుబాటులోకి త్వరలోనే వస్తుందని… నోట్ల రద్దు  ముందు మాదిరిగానే బ్యాంకింగ్‌ కార్యకలాపాలను నిర్వహిస్తామని ఎస్ బీ ఐ చైర్మన్ తెలిపారు.  మా బ్యాంక్ లకు సరిపడ కరెన్సీను పంపిస్తున్నాం. ఖాతాదారులు వారి అవసరాలకు తగినట్టు డబ్బును విత్‌ డ్రా చేసుకోవచ్చని కూడా తెలిపారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కూడా తీసుకోవలసిన అంశాలను గురించి చర్చిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించి  కొత్త నోట్లను , చిల్లర నోట్లను అందుబాటులోకి తెచ్చి ప్రజల కష్టాలను త్వరగా తీర్చేందుకు కావలసిన చర్యలు తీసుకున్నట్లు  అరుంధతి తెలిపారు.