నిరుద్యోగులకు’ పండగే’

1162

రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది భారీగా కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. దీంతో కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ల జారీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్  సర్వీసు కమిషన్ (టీఎస్ పీఎస్సీ) సన్నాహాలు చేస్తోంది. గురుకుల పాఠశాలలు, వైద్య ఆరోగ్య, పశు సంవర్థక శాఖల్లో ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ జారీ కానున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో మొదటి విడతగా 5 వేల పోస్టులు చేయనున్నారు. వీటిలో ఉపాధ్యాయ, అధ్యాపక, గ్రంథాలయ సిబ్బంది, పీఈటీ ఉద్యోగాలు ఉన్నాయి. వీటి భర్తీకి సంబంధించి విద్యార్హతలు, రోస్టర్ విధానం, రిజర్వేషన్, పరీక్షాపద్ధతి తదితర వివరాలు అందగానే నోటిఫికేషన్ జారీ చేయాలని టీఎస్ పీఎస్సీ భావిస్తోంది.

వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఏప్రిల్ లేదా మేలో రాతపరీక్ష నిర్వహించి జూన్ నాటికి నియామకాలు పూర్తి చేయాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు యోచిస్తోన్నట్టు తెలిసింది. అదేవిధంగా వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖలో ఖాళీగా ఉన్న 2118  డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ సిబ్బంది ఖాళీల భర్తీకి త్వరలోనే ప్రకటనలు వెలువడనున్నట్టు సమాచారం. అలాగే పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న 489 పశువైద్య సహాయకుల ఖాళీల భర్తీకి సైతం త్వరలో ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తోంది.