అభాగినులకు సర్కారు ‘ఆసరా’

116

అయినవాళ్లున్నా ఆదుకోలేని పరిస్థితి. అటు వితంతువు కాదు, ఇటు వికలాంగురాలు కాదు. కానీ, ఒంటరి జీవితాన్ని బలవంతంగా, దుర్భర దారిద్ర్యంలో ఈడ్చే అభాగ్య మహిళలెందరో. భర్తతో విడిపోయినవారిని, పిల్లలుండీ ఆలనా పాలన చూసుకోనివారిని, సమాజపు దురాచారాలకు బలై ఒంటరి జీవితం గడుపుతున్న జోగినీలను ఇకపైన కొంతలో కొంత ఆదుకోవాలని టిఆర్ఎస్ సర్కారు నిర్ణయించింది. ఇటువంటి ఒంటరి మహిళలకు 1,000 రూ.ల జీవన భృతి ఇవ్వాలని నిర్ణయించింది. సంపాదించే అండలేని నిరుపేద అతివలకోసం కెసిఆర్ కొత్త పథకం ప్రవేశపెట్టారు. వచ్చే 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించనున్నారు. ఈ నిర్ణయం నిజానికి ఎన్నికల మేనిఫెస్టోలో లేనప్పటికీ… మానవతా దృక్పథంతో ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు.

రాష్ట్రంలో రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది ఒంటరి మహిళలు ఉంటారన్న ప్రాథమిక అంచనా ఉందని, త్వరలో పూర్తి వివరాలు సేకరించి పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. వివిధ వర్గాలకు లబ్ధి కలుగుతున్నప్పటికీ సంపాదన అండ లేని ఒంటరి మహిళలు, తీవ్ర దుర్భర పరిస్థితులను గడుపుతున్నందున వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలన్న సూచనలు అందిన దృష్ట్యా ఈ పథకానికి రూపకల్పన చేసినట్లు సీఎం తెలిపారు.

“మా ప్రభుత్వం పేదలు ఎదుర్కొంటున్న సమస్యలు దృష్టికి వచ్చిన వెంటనే మేనిఫెస్టోతో సంబంధం లేకుండా వాటి పరిష్కారం కోసం పనిచేస్తోంది. మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు అందిస్తున్నం. బీడీలు చుట్టి శ్రమిస్తున్నా కుటుంబానికి సరిపడా ఆదాయం పొందలేక ఇబ్బందులు పడుతున్న బీడీ కార్మికులకు రూ. వెయ్యి చొప్పున జీవన భృతి ప్రకటించినం. పేద కుటుంబాలు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేక కష్టపడుతుండటంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టినం. ఆ తరహాలోనే ఇప్పుడు మేనిఫెస్టోలో ప్రకటించకున్నా ఒంటరి మహిళలను ఆదుకోవాలని నిర్ణయించినం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముందుగా అంచనా వేసుకుని సాధ్యాసాధ్యాలు గుర్తించి నిర్ణయం తీసుకోవాలనుకున్నం. కానీ పురుషులకన్నా పేదరికం మహిళలనే ఎక్కువగా వేధిస్తుంది. నిస్సహాయులైన ఒంటరి మహిళలకు నెలకు రూ. వెయ్యి చొప్పున జీవన భృతి చెల్లించి వారిని ఆదుకోవాలని నిర్ణయించినం. వెంటనే ఉత్తర్వులు విడుదల చేస్తున్నం. మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తం’’అని సీఎం ప్రకటించారు.

వివరాల నమోదు ప్రక్రియ ఆరంభం

ఈ పథకానికి అర్హులైన వారి వివరాలను వెంటనే నమోదు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఒంటరి మహిళలు వారి పేర్లను ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అర్హులైన వారికి లబ్ధి కలిగేలా చూడాలని కేసీఆర్‌ సూచించారు.