హైదరాబాదీకి సౌదీలో శిక్ష

73

ఓ హైదరాబాదీకి సౌదీ ప్రభుత్వం ఏడాది జైలుతో పాటు 300 కొరడా దెబ్బలు శిక్ష విధించింది. దోపిడి కేసులో నేరం రుజువైందని మలక్ పేట్ కు చెందిన ఎంబీయే పట్టభద్రుడు మహ్మద్ మన్సూర్ హుస్సేన్ కు సౌదీ అరేబియా న్యాయస్థానం ఈశిక్ష విధించింది. దీనిపై అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోపిడీ కేసులో తమ కుమారుడ్ని అరెస్టు చేసి అరేబియాలోని వదీ అల్ దవాసిర్ జైల్లో పెట్టారని, అతను నిర్దోషి అని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కుమారుడిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న ఆ తల్లిదండ్రులు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ను సాయం కోరారు.

ఎంబీయే పట్టభద్రుడైన హుస్సేన్.. మార్కెటింగ్ ఆడిటర్ ఉద్యోగంలో ఉన్నారు. గత సంవత్సరం ఆగస్టు 25న అతడు 1.06 లక్షల సౌదీ రియాళ్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు తుపాకి చూపి బెదిరించి అతడిని దోచుకొని నంబర్ ప్లేట్ లేని కారులో పరారయ్యారని హుస్సేన్ తల్లిదండ్రులు చెప్పారు. ఈ విషయం తాను పనిచేస్తున్న సంస్థ యజమానికి తెలుపగా, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించారని, ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌ కు వెళ్తే హుస్సేన్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అతని తల్లి హూరున్నీసా తెలిపారు.

తమ కుమారుడు సంస్థ ఖాతాలో 15 లక్షల సౌదీ రియాళ్లు జమచేశాడని, 1.06 లక్షల సౌదీ రియాళ్లకి కక్కుర్తి పడే అవకాశం లేదని ఆమె సుష్మా స్వరాజ్ కు వివరించారు.  కంపెనీ యజమానులు కూడా దీని గురించి ఆలోచించాలని విలపిస్తూ చెప్పారు. అక్కడి పోలీసులు హుస్సేన్‌ను నమ్మడం లేదన్నారు. ఈ విషయం తెలిసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా సుష్మాను ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు. హుస్సేన్‌కు వీలైనంత సాయం చేస్తామని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం హామీ ఇచ్చింది.