ఇండస్ట్రీలు పడకేశాయ్!

87

ఒక పరిశ్రమ నడవాలన్నా, ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలన్నా… చక్రం తిరుగుతూ ఉండాలి. గడచిన 60 రోజులుగా పారిశ్రామిక చక్రాలు ఆగిపోయాయి. ఉత్పాదన మందగించింది. కొత్త ఆర్డర్లు రాలేదు, పాత ఆర్డర్లలో ఎక్కువ శాతం క్యాన్సిల్ అయ్యాయి. డైలీ వేజెస్ పైన బతికే కార్మికుల ఇళ్లలో పొయ్యిలో పడుకున్న పిల్లి లేవలేదు. ఇదంతా కరెన్సీ రిఫార్మ్స్‌ వల్ల తలెత్తిన సంక్షోభ పరిస్థితి. పరిశ్రమలకు పెద్ద నోట్ల సెగ బాగా తగిలింది. మ్యాన్యుఫాక్చరింగ్ సెక్టారులో డిసెంబర్‌ నెల గడ్దుగా సాగింది. అక్టోబరుతో పోలిస్తే వృద్ధిరేటు మూడు పాయింట్లు పడిపోయి, 49.6 పాయింట్ల దగ్గర నిలిచింది. ఇది మొత్తం ఏడాది (12 నెలల కాలం)లోనే కనిష్ట స్థాయిగా ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పిఎంఐ) గుర్తించింది. 2015 డిసెంబర్‌ తరువాత ఈ స్థాయికి సూచీ పడిపోవడం ఇదే తొలిసారి. ఒకే నెలలో ఇంత తీవ్ర స్థాయిలో దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి ఇండెక్స్ పడిపోవడం ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2008 నవంబర్‌ తరువాత ఇదే మొదటిసారి.

ఈ సూచీ 50 పాయింట్ల పైన ఉంటే దానిని వృద్ధిగానే భావిస్తారు. 50 పాయింట్ల దిగువకు పడిపోతేనే, క్షీణతగా పరిగణించడం జరుగుతోంది. కొత్త ఆర్డర్లు, నిల్వలు, ఉత్పాదన, సరుకు డెలివరీ, మానవ వనరుల వినియోగం వంటివి ప్రామాణికంగా తీసుకుని ఈ సూచీని లెక్కిస్తారు. దీని ఆధారంగానే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయన్న అంచనాకి ఆర్థిక, పారిశ్రామిక రంగ నిపుణులు వస్తారు. కంపెనీ భవిష్యత్తు, కొనుగోళ్లు ఏ విధంగా ఉండబోతాయన్నదికూడా ఈ సూచీ ద్వారానే ఒక అంచనా వేసుకుంటారు.

నవంబర్ 8 తర్వాత 500, 1,000 రూ.,ల నోట్లు అందుబాటులో లేకపోవడం, 2,000 నోట్లతో లావాదేవీలు మదగించడం పెద్ద సమస్యగా మారాయి. దీని ప్రభావం కొనుగోళ్లమీద, ఉపాధి అవకాశాలపై సమంగా పడ్డాయి. పారిశ్రామిక రంగంలో ఉత్పత్తులకు ఆర్డర్లు తగ్గిపోయాయి. అప్పటికే ఆరు నెలలుగా విదేశీ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో దేశీయ పరిశ్రమ ఒడిదొడుకుల్లో ఉండగా, డిమోనిటైజేషన్‌ పిడుగులా పడింది. రా మెటీరియల్ కొనుగోలుపై సగటు వ్యయం బాగా పెరిగింది. స్తూల జాతీయోత్పత్తి (జిడిపి)లో పారిశ్రామిక ఉత్పత్తి 15 శాతం వరకు ఉంది. ఈ పరిస్థితుల్లో జనవరి గణాంకాలు కీలకం కానున్నాయి.