‘కత్తి’లాంటి ‘ఖైదీ నెంబర్ 150’

313

చిత్రం : ఖైదీ నంబర్ 150
బేనర్ : కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
కథ : ఏ.ఆర్. మురుగుదాస్
రచన : పరుచూరి బ్రదర్స్
మాటలు : సాయి మాధవ్ బుర్రా, వేమారెడ్డి. పాటలు : దేవిశ్రీ ప్రసాద్, శ్రీమణి, రామజోగయ్య శాస్త్రి. ఫోటోగ్రఫీ : ఆర్. రత్నవేలు. ఎడిటింగ్ : గౌతం రాజు. సంగీతం : దేవీశ్రీ ప్రసాద్. నిర్మాతలు :- రామ్ చరణ్. స్క్రీన్ ప్లే – దర్శకత్వం : వి.వి. వినాయక్. నటులు : చిరంజీవి, కాజల్ అగర్వాల్, తరుణ్ అరోరా, బ్రహ్మానందం, ఆలీ, పోసాని కృష్ణ మురళి, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, పృధ్వీరాజ్ తదితరులు. పాటల్లో లక్ష్మీ రాయ్, రామ్ చరణ్. వివి వినాయక్ కూడా.

బాస్ యీజ్ బ్యాక్.. అంటూ తొమ్మిదేళ్ళ తర్వాత చిరంజీవి 150 చిత్రంగా వచ్చింది ‘ఖైదీ నంబర్ 150’. తమిళ మాతృక ‘కత్తి’ చిత్రానికిది తెలుగు సేత. ఎన్నో అంచానాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మించడం మరో విశేషం. మరి ‘ఖైదీ నంబర్ 150’ సినిమా అటు చిరంజీవిని- యిటు ప్రేక్షకులని- వారి మధ్య తొమ్మిదేళ్ళ ఖాళీని పూరించిందా లేదా అన్నది యిప్పుడు చూద్దాం.

రైతు దేశానికి వెన్నెముక. ఆ వెన్నెముక విరుగుతున్న చప్పుడు మన దేశంలో నిత్యమూ నిరంతరమూ వినిపిస్తూనే వుంది. లక్షలాది రైతుల ఆత్మహత్యలు చేసుకుంటూనే వున్నారు. రైతుల భూమిని కార్పోరేట్ కంపెనీలు హస్తగతం చేసుకుంటున్నాయి. రైతులంతా కూలీలుగా తమ వూరికి తామే పరాయి వాళ్ళుగా మారిపోతున్నారు. ఈ అంశాలను కథాంశం కావడం తాజా పరిస్థితుల ప్రతిఫలనమే! కాని రైతుల నుండి కార్పోరేట్ శక్తులు నేరుగా లాక్కోవడం లేదు. మనం ఎన్నుకున్న ప్రజాస్వామిక ప్రభుత్వాలు రైతుల నుండి అభివృద్ధి పేరుతో బలవంతంగా భూమిని లాక్కుంటున్నాయి. అరెస్టులూ కాల్పులూ కేసులూ గిట్టుబాటుకాని వ్యవసాయమూ.. దోపిడీ అంతా దోషమంతా ప్రభుత్వాలదే. ప్రభుత్వాలు తలుపులు తెరవకుండా కార్పోరేట్ దొంగలు కాదు, ఏ దొంగలూ లోపలికి చొరబడలేరు. సౌకర్యంగా పాపమంతా కార్పొరేట్ల మీదికి నెట్టి నీడతో యుద్ధం చేసే నాటకీయ కథ యిది.

కథ కొస్తే- జైల్లో ఖైదీగా వున్న కత్తి శీను(చిరంజీవి) మరోఖైదీ తప్పించుకోవడంతో- తన తెలివితేటలని వుపయోగించి జైలు అధికారులకు దొరికేలా చేస్తాడు. శీనువల్ల ఖైదీ దొరికాడంటే, పోలీసుల చేతకానితనం బయటప్రపంచానికి పొక్కిపోతుందని శీనుని చంపేయాలని అనుకుంటారు. అంతలోనే శీను కలకత్తా వొదిలి హైదరాబాద్ చిల్లర దొంగ అలీ యింట్లో యెంట్రీ యిస్తాడు. పోలీసులకు దొరక్కుండా విదేశాలకు వెళ్ళిపోవాలని పాస్ పోర్ట్  సంపాదించి, పాత రత్తాలు(లక్ష్మి రాయ్)తో పాటేసుకు వెళితే- ఎయిర్ పోర్ట్ లో లక్ష్మి(కాజల్) కనిపిస్తుంది. పెన్ను అడిగితే, మనసే యిచ్చేసి ఆమె కోసం విదేశీప్రయాణం కేన్సిల్ చేసుకుంటాడు. ఈ పరిస్థితుల్లో వుండగా శంకర్(చిరంజీవి) మీద కాల్పులు జరగడంతో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి తన స్థానంలో శంకర్ని, శంకర్ స్థానంలో తానూ ఉండేలా శీను చేస్తాడు. శంకర్ జైలు పాలుకాగా- శీను డబ్బుకు ఆశపడి చేసిన ప్రయత్నంలో శంకర్ గా అవతారమెత్తి, అతని వెనుకన వున్న రైతునీ రైతు నమ్ముకున్న నేలనీ ఎలా కాపాడాడు అన్నదే మిగతా కథ!

భూమి నీరు తోనో, రైతు కన్నీరు తోనో తడవాలి.. అంటూ కథని ఎన్నుకోవడం బాగుంది. కాని కథ కార్పోరేట్ శక్తుల వెనుకన వున్న అసలు శక్తుల్ని వదిలేసింది. సినిమా మొత్తం హీరోని నిలబెట్టే ప్రయత్నంలో కథలో వున్న తడి ప్రేక్షకునికి చేరదు. హీరో చేసే సాహసాలు, ఫైట్లు, మాటలు.. యివన్నీ మళ్ళీ మళ్ళీ మనల్ని మూసలోకి తోసినట్టు అనిపిస్తుంది. సినిమాని ఎలాగైనా సక్సెస్ చెయ్యాలని చేసిన ప్రయత్నం.. అంతకు మించిన వొత్తిడి ఆయా రచయితలమీద వున్నట్టు తోస్తుంది. అవకాశం దొరికినప్పుడల్లా మాటలు తూటాల్లా పేలుతూ వుంటాయి. ఒక్క గుండు చాలు. వందగుల్ల వర్షం కురిపించినట్టు వుంటుంది. మాటలు బావున్నా యెక్కువై నాటకంలా సాగుతూ వుంటాయి. పాటలు రొటీన్ గా వున్నా రిచ్ గా  చూడని లోకేషన్స్ లో చిత్రీకరించి ఆకట్టుకున్నా కథని ఆటంక పరిచిన సందర్భాలు లేకపోలేదు. ఫైట్స్ బావున్నాయి.

చిరంజీవి తన అరవై ఒకట్లో కూడా కుర్రాడిలా హుషారుగా వుండి అభిమానులకు హుషారునిచ్చే ప్రయత్నం చేసాడు. నటనలో చెప్పక్కర్లేదు. ద్విపాత్రాభినయం చేశాడు. కాస్తంత అందంగా కనిపించాడు. కాజల్ పేరుకే హీరోయిన్. ఎప్పటిలా పాటలకు తప్ప పెద్దగా అవకాశం లేదు. బ్రహ్మానందం కామెడీ రొటీన్. ఇది వరకు సినిమాల్లో చూసిందే. బుక్కయిందే. ‘ప’ కు బదులుగా ‘ఫా’ పలికి రఘుబాబు కాస్త నవ్వించాడు. పోసాని యధాతదం. అలీ కూడా అంతే యధాతదం. ఇది వరకు చూసిన సినిమాల్లోని పాత్రలే.

సినిమాలో అన్నీ బాగున్నాయి. లేని దొక్కటే. ఫీల్. హృదయవిదారకమైన రైతు గురించి ‘నీరు నీరు నీరు.. రైతుకంట నీరు’ అని పాడుకోవడమే గాని మన కళ్ళుకు నీళ్ళు రావు సరికదా, కనీసం తడవ్వు! ఒక మంచి కథను నమ్మి, అంతకన్నా యెక్కువ కథానాయకుడిని నమ్మి, అతడి కోసమే సినిమా చేస్తే, కథ కోసం పాత్ర కాకుండా- పాత్రకోసం కథని కకావికలం చేస్తే- మరో పాత సినిమా అవుతుంది. ఇప్పుడు చిరంజీవి సినిమా అయ్యింది! అలవాటయిన ‘అభిమాన’ ప్రేక్షకులని మటుకు తప్పక అలరిస్తుంది.

రేటింగ్: 3/5

-జాసి