ఉగ్రవాదానికి కరెన్సీ కష్టం!

103

కరెన్సీ రిఫార్మ్స్ వల్ల సామాన్యుడి కష్టాల సంగతి అలా ఉంచితే, దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసే శక్తులు, శాంతి భద్రలకు భంగం కలిగించే ఉగ్రవాదులకు వెన్ను విరిగింది. ఈ శక్తులన్నిటికీ బయటనుంచి వచ్చే నిధులు, దేశీయంగా వసూలు చేసుకునే విరాళాలు పెద్ద మొత్తంలో నిలిచిపోయాయి. 500, 1,000 రూ.ల నోట్ల రద్దు ఫలితంగా మిలిటెంట్లకు నిధులు అందడం కనాకష్టంగా మారింది. పొరుగు దేశం నుంచి కోట్లలో అందే నకిలీ నోట్ల రాకెట్, హవాలా దందా తగ్గిపోయాయి.

ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం.. 500, 1,000 నోట్ల రద్దు తర్వాత జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలు 60 శాతం వరకు తగ్గాయి. ఒక్క డిసెంబర్ నెల మొత్తం మీద చూస్తే, కాశ్మీర్ లోయలో కేవలం ఒకే ఒక్క పేలుడు ఘటన సంభవించింది! అలాగే, భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వే ఘటనలుకూడా తగ్గుముఖం పట్టాయి. నకిలీ నోట్లు ఆగిపోయేసరికి మిలిటెంట్లకు నిధుల కొరత బాగా ఏర్పడింది. దేశంలో ముఖ్యంగా కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే కొన్ని బృందాలు లోకల్ యువతను చేరదీసేవి. 500, 1,000 నోట్లను లోకల్ కమాండర్లకు అందజేసి… వాళ్లద్వారా నిరుద్యోగ యువకులకు చేర్చేవారు. వాళ్లను భద్రతా దళాలపైకి రెచ్చగొట్టి రాళ్లు రువ్వించేవి. ఇప్పుడు ఆ నోట్లు రద్దేయ్యేసరికి పెద్ద మొత్తంలో కరెన్సీ అందుబాటులోకి రావడం లేదు. లోకల్ యువతకు డబ్బులిచ్చి రెచ్చగొట్టడంకూడా చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గింది.

అలాగే, హవాలా వ్యాపారంకూడా సగానికి సగం తగ్గింది. హవాలా ఏజెంట్ల కాల్ ట్రాఫిక్ సగానికి సగం పడిపోయిందని టెలికాం సంస్థలు చెబుతున్నాయి. నకిలీ నోట్లుకూడా మార్కెట్టులోకి రాలేదు. పాకిస్థాన్‌లో ప్రింటయ్యే ఫేక్ కరెన్సీకి ఒక్కసారిగా చెక్ పడింది. క్వెట్టా, కరాచీలలో ఉన్న సెక్యూరిటీ ప్రెస్‌లలో చాలాకాలంగా ఇండియన్ కరెన్సీకి నకిలీ నోట్లను పాకిస్థాన్ ముద్రిస్తోంది. కొత్త నోట్లలో సెక్యూరిటీ ఫీచర్లు, రంగులు, కరెన్సీ కాగితం అన్నీ దేశీయంగానే ఉత్పత్తి అయినవి. గతంలో విదేశాల్లో అవుట్‌సోర్సింగ్ ద్వారా సేకరించి ప్రింట్ చేయడంవల్ల ఫేక్ కరెన్సీ తయారీకి వీలయ్యేది. వీటన్నింటినీ దొంగ మార్గాల్లో సేకరించి ఫేక్ కరెన్సీ తయారీకి చాలా సమయం పడుతోంది. నకిలీ నోట్లు మార్కెట్టులోకి వచ్చే అవకాశాలు ఇప్పట్లో లేవని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.