కొత్త జిల్లాలకు నిధుల కోటా!

100

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా 30 జిల్లాలు వెనకబడి ఉన్నాయి. అందువల్ల “వెనుక బడిన జిల్లాల అభివృద్ధి నిధి”ని రెండింతలకు పెంచుతూ 900 కోట్ల రూ.లు శాంక్షన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలో 30 జిల్లాలను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని కోరుతూ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి లేఖ రాశారు. రెండేళ్లుగా రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ఇస్తున్న 450 కోట్ల రూ.ల నిధిని 900 కోట్లకు పెంచాలని కేరారు. విజయ దశమినాడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరపడానికి ముందు రాష్ట్రంలోని 10 జిల్లాల్లో హైదరాబాద్‌ మినహా తొమ్మిది జిల్లాలను కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలుగా గుర్తించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 31కు పెరిగినందువల్ల 30 జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించి తాజా నోటిఫికేషన్‌ జారీ చేయాలని ప్రతిపాదించింది.

‘రాష్ట్ర పునర్విభజన చట్టం’ ప్రకారం కొత్త రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో చేపట్టే కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకారం అందించాలి. 2015–16లో రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి పనులకు జిల్లాకు 50 కోట్ల రూ.ల చొప్పున కేంద్రం 450 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరంలో రెండో విడత రూ.450 కోట్లు గత నెలలోనే కేటాయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధి పనులకోసం వచ్చే 2017–18 బడ్జెట్టులో గ్రాంటును 900 కోట్ల రూ.లకు పెంచాలని కోరింది.