ఆకలి కేకలు ఉండవట!

161

మరో 13 ఏళ్లలో దేశంలో ఆకలి కేకలు ఉండవ్! సమతుల పౌష్టికాహారంతో అందరికీ ఆహారాన్ని అందించవచ్చు. చిరు ధాన్యాల ఉత్పత్తిని పెంచితే ప్రజలకు పౌష్టికాహారం అందుతుంది. నిరంతర హరిత విప్లవం ద్వారా ఇది సాధ్యం! ఈ మాటలన్నవారు దేశంలో ‘హరిత విప్లవ పితామహుడు ‘గా పేరొందిన వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ స్వామినాథన్‌. తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్‌లో “ఆహారం-పౌష్టికాహార భద్రత”పై మాట్లాడినప్పుడు దేశ భవిష్యత్తును సానుకూల దృక్పథంతో ఊహించారు.

భారతదేశం ఆకలి కేకల నుంచి విముక్తమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. నిరంతర హరిత విప్లవం సాగినట్లయితే 2030 నాటికి ఆకలి బాధ అంతమవుతుందని వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ భరోసా ఇచ్చారు. శాశ్వత హరిత విప్లవమే (ఎవర్‌ గ్రీన్‌ రివల్యూషన్‌) మార్గమన్నారు. “బెంగాల్‌ కరువు (1942–43) కాలంలో వేలాది మంది తిండి గింజలకు కొరత లేకున్నా సరైన పంపిణీ జరగక, ప్రజలకు అందుబాటులో లేక కన్నుమూశారు.

తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూతో పాటు పలువురు వ్యవసాయం, నీటిపారుదల, ఎరువుల రంగాలపై దృష్టి కేంద్రీకరించడంవల్ల… హరిత విప్లవం వచ్చింది. ఐన్స్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్, ధరలు, సేకరణ, ప్రజా ప్రాతినిధ్యం కీలకాంశాలుగా హరిత ఉద్యమం సాగదంతో 1968 నాటికి తిండిగింజలకు కరువు దీరింది. 2013లో తెచ్చిన ‘ఆహార భద్రతా చట్టం’ దేశ చరిత్రలోనే ఓ మైలు రాయి. 2030 నాటికి సుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధన ప్రస్తుత ఎజెండా. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలలో ఇదొకటి.

ఆకలిని అంతం చేయడం, ఆహార లక్ష్యాన్ని సాధించడం, పౌష్టికాహారాన్ని అందించడం మన ముందున్న లక్ష్యం. 2020 నాటికి దేశంలో 10 కోట్ల టన్నుల గోధుమలు ఉత్పత్తయ్యే అవకాశం ఉంది. అదే స్థాయిలో చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాల దిగుబడి, వినియోగం పెరగాలి. అప్పుడే సమతుల ఆహారం అందించినట్టవుతుంది. ఈ లక్ష్య సాధనకు నిత్య హరిత విప్లవమే మార్గం. ఇది శాశ్వతంగా సాగాలి” అని ప్రొఫెసర్ స్వామినాథన్ ఆకాంక్షించారు.