రాష్ట్రపతి చేతిలో ప్రాజెక్టుల భవిష్యత్తు!

96

తెలంగాణలో తలపెట్టిన అనేక ప్రాజెక్టుల భవిష్యత్తు భూ సేకరణతో ముడిపడి ఉంది. జీవో-123 ద్వారా భూ సేకకరణకు ఉమ్మడి హైకోర్టు ససేమిరా తేల్చి చెప్పేసింది. నూతన భూ సేకరణ బిల్లు ఇప్పటికే అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం పొంది సిద్ధంగా ఉంది. దీనిపై రాష్ట్రపతి ఆమోద ముద్ర పడితేనే ముందుకు సాగడానికి వీలవుతుంది. ఇటీవల దక్షిణ భారత పర్యటనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చినపుడు ఆయనను రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు కలిసి… ఈ బిల్లుకు ఆమోదం తెలపవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి విశేష అధికారాలతో నూతన భూ సేకరణ బిల్లును వెనక్కి తిప్పికొడితే కథ మళ్లీ మొదటికొస్తుంది.

భూ సేకరణకు సంబంధించి మెరుగైన ప్రతిపాదనలు జీఓ-123లో ఉన్నాయన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన. అయితే, ఈ జీవోపట్ల మొదటి నుంచీ రైతులు, సామాజిక కార్యకర్తలు, తెలంగాణ జెఏసి పూర్తి వ్యతిరేకతతో ఉన్నాయి. వీరి వత్తిడికి తలొగ్గినట్లు కనిపిస్తూనే… జీవో-123లోని అంశాలనే కొత్త బిల్లులోనూ పొందుపరచి తెలంగాణ రెండు సభల్లోనూ ఆమోదింపజేశారు. గుజరాత్‌ తరహాలో కొత్త చట్టం పేరుతో రూపొందించిన ఈ కొత్త బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందినా సరే, సవాలు చేయడానికి రైతు సంఘాలు రెడీ అవుతున్నాయి.

సోషల్ ఇంపాక్ట్ పట్టించుకోని సర్కారు

భూ సేకరణ చట్టం-2013లో పేర్కొన్న సామాజిక ప్రభావ మదింపు, గ్రామ సభల ఆమోదం అవసరం లేకుండా భూములను కొనుగోలు చేసే అధికారం కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా కమిటీలకు అప్పగించే ప్రతిపాదన కొత్త బిల్లులో ఉంది. భూ సేకరణ చట్టం-2013లో నిర్వాసితులకు కల్పించిన హక్కులనుకూడా కాలరాసే విధంగా కొత్త చట్టం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. ప్రధానంగా నిర్వాసితులకు, భూమి లేని నిరుపేదలకు, చేతివృత్తుల వారికి గిరిజనులకు షెడ్యూలు 2, 3లో కల్పించిన సౌకర్యాల నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లను కొత్త చట్టంలో చేర్చిందని చెబుతున్నారు. ప్రభుత్వం పూర్తిగా కుయుక్తితో… పునరావాసం, భూమికి భూమి, ఉద్యోగం, ఉపాధి వంటి మౌలిక జీవనోపాధి అంశాల నుంచి తప్పించుకోవడానికి కొత్త చట్టం తయారు చేసిందని అంటున్నారు. భూ సేకరణ చట్టం-2013 ప్రకారం భూములు కోల్పోయేవారికి 4 రెట్లు నష్ట పరిహారం ఇవ్వాలి. కొత్త చట్తం కేవలం మూడు రెట్ల నష్ట పరిహారానికే పరిమితమైంది.

16 వేల ఎకరాలు ఇప్పటికే సేకరణ

ఇదిలా ఉంటే, జీవో-123 కింద రైతులతో ఒప్పందాలు చేసుకుని ఇప్పటికే 16,000 ఎకరాల వరకు భూ సేకరణ జరిగిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్ కోసం 7,000 ఎకరాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కింద 9,000 ఎకరాలను టిఆర్ఎస్ ప్రభుత్వం సేకరించింది. వీటికి 3,000 కోట్ల రూ.ల చెల్లించడమైంది. ఈ భూములకు, పరిహారానికి సంబంధించి తుది తీర్పులోనే కోర్టు స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. జీవో-123 కింద జరిగిపోయినన లావాదేవీలు చెల్లకపోతే ప్రభుత్వం మరింత ఇరుకున పడుతుంది. మొత్తంగా లక్ష ఎకరాలు సేకరించి, తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను, ఇండస్ట్రియల్ కారిడార్లను చేపట్టాలన్నది టిఆర్ఎస్ సర్కారు టార్గెట్‌. ఇది సాధ్యపడాలంటే రాష్ట్రపతి నిర్ణయమే ఆధారం.