ఓంపురి కన్నుమూత

87

విలక్షణ నటుడు ఓం పురి హఠాత్తుగా కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. 66 ఏళ్ల ఓంపురి దేశంలోని వివిధ భాషలతో పాటు హాలివుడ్ సినిమాల్లో కూడా అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించారు. హిందీ, తెలుగుతో పాటు దేశంలోని ఇతర ప్రాంతీయ భాషల్లో ఆయన నటించారు. ముఖ్యంగా ఆర్ట్ సినిమాల్లో ఓంపురి నటనకు అని వర్గాలు ప్రజలు ఆదరాభిమానాలు లభించాయి. సినిమాలతో పాటు అనేక నాటకాల్లో కూడా ఓంపురి నటించారు. 1950, అక్టోబర్‌ 18న హర్యానాలోని అంబాలాలో ఓం పురి జన్మించారు. చిన్నప్పటి నుంచి నటన పట్ల విశేషమైన ఆసక్తి కనబరిచే ఓంపురి పూణేలోని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరారు. అనంతరం నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో డిప్లమో చేశారు. వివిధ చిత్రాల్లో ఆయన నటనకు అనేక ప్రశంసలు లభించాయి. ‘అర్ద్‌ సత్య’, ‘జానే భీదో యారో’,‘పార్‌’ లాంటి సినిమాల్లో ఆయన నటన ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఎనిమిదిసార్లు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులతో పాటు రెండుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. అదేవిధంగా 1990లో కేంద్ర ప్రభుత్వం ఓంపురిని పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఓంపురి మరణ వార్త విని ప్రధాని నరేంద్ర మోడీ చలించిపోయారు. నాటక, సినీ రంగాలకు విశేష సేవలు అందించిన ఓం పురి మరణం తీరని లోటు అని నివాళులర్పించారు.