నేరుగా లబ్దిదారుకే సబ్సిడీలు!

88

ఇకపైన పథకం ఏదయినా సబ్సిడీ నేరుగా లబ్దిదారుకే అందనుంది. కేంద్ర నుంచి వచ్చే నిధులకు లెక్కలు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాలు లబ్దిదారుల సంఖ్య విషయంలో సమాచార గోప్యత పాటిస్తున్నాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా 36,000 కోట్ల రూ.లు దుర్వినియోగం జరుగుతున్నట్లు కేంద్రం లెక్కలు వేసింది. దేశమంతా ఆధార్ అనుసంధానం జరుగుతున్నందువల్ల సబ్సిడీలు ఇకమీదట నేరుగా లబ్దిదారులకే అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్పష్టమైన సమాచార సేకరణతో కేంద్రం చర్యలు తీసుకుంటోంది. మరో నెల రోజులలో కొత్త బడ్జెట్ ప్రవేశపేట్టనున్న నేపథ్యంలో… నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి కేంద్రం పూనుకుంది. సబ్సిడీని నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేసినట్లయితే దుర్వినియోగమవుతున్న 36,000 కోట్ల రూ.లు మిగులుతాయని, మరింతమందికి లబ్ది చేకూర్చవచ్చని కేంద్రం అంచనా వేసింది.

ఒక్కో లబ్దిదారు ఒకటికి మించి సబ్సిడీలు పొందడంమూలానా లబ్దిదారుల సంఖ్య ఎంతనేది తేలడం లేదు. ఈ లెక్కలకు సంబంధించి ఆరు నెలల క్రితమే అన్ని రాష్ట్రాలకూ తాఖీదులు పంపించింది. ఇప్పుడు కరెన్సీ రిఫార్మ్స్ నేపథ్యంలో ప్రతి పైసాకి లెక్క పక్కాగా ఉండాలని కేంద్రం కోరుతోంది. “ఒక్కొక్క కుటుంబం ఎన్ని స్కీములను అందుకుంటోంది. ఇంట్లో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు” అనే సూక్ష్మస్థాయి లెక్కలతో కేంద్రం పక్కాగా ప్లాన్ చేస్తోంది. గ్యాస్ సబ్సిడీ తరహాలోనే ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చే అన్ని స్కీముల పరిధిలోకి లబ్దిదారుల డేటాని తీసుకురానున్నారు. అదే విధంగా, వేర్వేరు పేర్లతో వివిధ శాఖల్లో అమలవుతున్న పథకాలను ఏకీకృతం చేస్తారు. స్కీములను అందుకునే ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డ్ ఉంది. అందువల్ల ఒక్కొక్కరు ఎన్ని పథకాలను అందుకుంటున్నారనే లెక్క తీస్తోంది. ప్రభుత్వపరంగా ఒక్కొక్కరూ ఏయే ప్రయోజనాలు పొందుతున్నారనే వివరాలను సేకరిస్తోంది. లబ్ధిదారుల జాబితాని ఆధార్‌ కార్డు నంబర్లతో సహా అందజేయాల్సి ఉంటుంది.

అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకాలం చాలా స్కీముల్ని తమ సొంత స్కీములుగా ప్రచారం చేసుకుంటూ ప్రజాభిమానం పొందుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అంతా తామే అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నాయి. “సొమ్మొకడిది-సోకొకడిది” అన్నట్లుగా కేంద్ర నిధులతో పథకాలు నిర్వహిస్తూ, గుడ్‌విల్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టేస్తున్నాయి. కేంద్రం ఇకపైన నేరుగా లబ్దిదారుకే సబ్సిడీని అందించినట్లయితే తమ పప్పులు ఉడకవని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సమాచారాన్ని దాచిపెడుతున్నాయి. లబ్ధిదారుల లిస్టుని ఆధార్ కార్డ్ సహా కేంద్రం చేతిలో పెడితే బండారం బయట పడుతుంది. లబ్ధిదారుల ఎంపికకు అనుసరించిన విధానం మొదలుకుని అర్హులెందరు, అనర్హులెందరు, బోగస్ లబ్దిదారులెందరు వగైరా తప్పులు వెల్లడవుతాయి. ఆరు మాసాలుగా సమాచారం అడుగుతున్నా ఇవ్వని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు వెళ్లి స్వయంగా సేకరిస్తున్నారు.

ఇప్పటికే పలు పథకాలకు సంబంధించి సబ్సిడీని బ్యాంక్ ఖాతాల్లో కేంద్రం జమ చేస్తున్న విషయం తెలిసిందే. గ్యాస్‌ సబ్సిడీకి ఆధార్ నెంబర్ అనుసంధానం చేసి నేరుగా కన్స్యూమర్ బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నందున దాదాపు 28,000 కోట్ల రూ.లు ఆదా అవుతున్నట్లు లెక్క తేలింది. ఉపాధి హామీ పథకం కూలీలకు నేరుగా ఖాతాల్లోనే సొమ్ము జమ చేస్తోంది. రేషన్ సరుకులు, విత్తనాలు, డ్రిప్‌ ఇరిగేషన్‌, వృద్ధాప్య పింఛన్‌లు, స్కాలర్‌షిప్పులు, ఉపాధి శిక్షణ, అంగన్‌వాడీ, వైద్య ఆరోగ్య పథకాలకు సబ్సిడీ నిధులను నేరుగా లబ్ధిదారులకు చెల్లిస్తుంది.