న్యాయానికి అన్యాయం!

157

“నువ్వు ఖూనీలు చెయ్యి.. పుండాకోర్ పనులు చెయ్యి.. నీకు శిక్షలు పడవు..!”

“ఎందుకని..?”

“శిక్షలు పడవంతే.. దొంగతనాలు చెయ్యి.. దోపిడీలు చెయ్యి.. కుట్రలు చెయ్యి.. కేసులుండవు..!”

“కోర్టులు వూరుకుంటాయా..?”

“ఊరుకోక.. వురిశిక్షలు వేస్తాయా..?”

“మన న్యాయ వ్యవస్థ బలమైనది..!”

“ఔను.. అందుకే మనదేశంలో మూడుకోట్ల వరకూ కేసులు పెండింగులో వున్నాయి..!”

“ఎవరు చెప్పారు..?”

“మన భారతదేశపు నలభై మూడవ ప్రధాన న్యాయమూర్తి.. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా.. టి.యస్. ఠాకూర్ స్వయంగా చెప్పారు..”

“అవన్నీ యెప్పుడు క్లియర్ అవ్వాలి.. యెప్పుడు శిక్షలు పడాలి..?”

“కదా?, దానికి తోడు కొత్తగా సైబర్ నేరాలూ వాటి చట్టాలూ.. మెడికో లీగల్ కేసులూ.. జన్యుపరమైనవీ.. వ్యక్తిగతమైనవీ.. అన్నీ రోజు రోజుకీ కేసులు పెరిగిపోతున్నాయని ఆయనే చెప్పారు..”

“ఆయన అప్పట్లో ప్రధానమంత్రి ముందు కళ్ళనీళ్ళతో జడ్జీలను నియమించండి అని కోరారు కదా?, ఆతరువాత కూడా మళ్ళీ మరోసారి యేడ్చారు..”

“ప్రధాన న్యాయమూర్తే సాక్షాత్తూ ప్రధానమంత్రి ముందే యేడ్చినా యెద పోసుకున్నా లేనిది యింక యెవరు పట్టించుకుంటారు..?”

“దేశ జనాభా పెరుగుతున్నకొద్దీ అభివృద్ధి పెరుగుతున్నకొద్దీ నేరాలూ కేసులూ పెరుగుతాయి కదా? అప్పటికీ లోక్ అదాలత్ లు అనీ- ఒక్కరోజూ వందకేసులూ అనీ- తీర్పులిచ్చినా.. మూడు కోట్ల కేసులంటే.. అయ్యబాబోయ్..”

“మరి? నీకు వురిశిక్ష పడాల్సివున్నా.. అంతకంటే ముందు నీ వయసు వుడిగి చనిపొతావు..”

“ఔను, ఈ సివిల్ ఆస్తి కేసుల్లోనయితే..తండ్రులు పడ్డ తగాదాలకి కొడుకులూ కూతుళ్ళూ కోర్టులచుట్టూ తిరగడం యెన్ని చూడలేదూ..?”

“ఈసారి.. కొడుకులూ కోడళ్ళూ కాదు, మనవలూ మనవరాళ్ళూ కోర్టులచుట్టూ తిరిగేంతవరకూ టైం పడుతుంది..!”

“అందుకే నేరం చెయ్యడం.. దర్జాగా బయటతిరగడం.. యెప్పటికో శిక్షపడితే- అప్పుడు ప్రభుత్వం సొమ్ము మెయ్యడం..”

“అందుకే- కోర్టెక్కినోడూ గాడిదెక్కినోడూ వొకటే.. అని అన్నది..!”

“అవసరమైనంత మంది జడ్జీలే లేనప్పుడు- యింక శిక్ష పడేదెప్పుడు? వేసేవాడు వుండాలిగా..?”

“తీర్పులిచ్చేవాడు లేడంటే- నేరం చేసేవాడిని ప్రోత్సహించినట్టే..!”

-బమ్మిడి జగదీశ్వరరావు