వోటుకు నోటు అంతే సంగతులు!

176

ఏ కేసులోనైనా సాక్ష్యాన్ని ఇన్వెంటరీ లిస్టులో చేరుస్తారు. కేసు కోర్టుకెళ్లినప్పుడు అవే ప్రాథమిక సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఏడాదిన్నర క్రితం పట్టుబడిన ఒక స్ట్రింగ్ ఆపరేషన్ కేసులోమాత్రం సాక్ష్యాన్ని నిర్లక్ష్యం చేశారన్న వాదన వినిపిస్తోంది. మండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్ ఓటుకోసం తెలుగుదేశం పార్టీ 50 లక్షల రూ.లు ఇస్తుండగా తెలంగాణ ఏసిబి వల పన్ని పట్టుకుంది. ఈ కేసులో టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టయి బెయిల్‌పై బయటకొచ్చిన సంగతి తెలిసిందే.

ఆ సొమ్మంతా పాత రద్దయిన నోట్ల రూపంలో ఉండగా, వాటిని పంచనామా చేసి ఇన్వెంటరీలో చేర్చడాన్ని టి-ఏసిబి విస్మరించింది. ఈ మొత్తాన్ని ఏక సంఖ్యగా నమోదు చేసుకుని “ఫిక్స్ డ్ డిపాజిట్” చేసింది. రేవంత్ రెడ్డి ఇచ్చిన మొత్తం ఇదేనని చెప్పడానికిగానీ, వాటి నెంబర్లు, బ్యాంక్ ట్యాగులు ఏమీ లేకుండా బ్యాంకులో చేరిపోయాయి. ఇదే విషయాన్ని హైకోర్టు వారికి  కూడా ఏసిబి విన్నవించింది. ఈ “అక్రమ నగదు” ఇటీవలి వరకు ఏసిబి కోర్టులోనే ఉండేది. అయితే, డిసెంబర్ 30తో రద్దయిన నోట్లను మార్చుకోవడానికి గడువు ముగియనుండడంతో కోర్టు అనుమతితో తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేసేశారు. ఈ మొత్తాన్ని చెలామణీలోకి తెచ్చారు తప్ప, వివరాలను ఇన్వెంటరీ (సమగ్ర జాబితా)కి ఎక్కించడం మరచిపోయారు. దీనితో అక్రమ నగదు ఆనవాళ్లేవీ ఏసిబి దగ్గర లేవంటున్నారు.

టుకు నోటు కేసు విచారణకు వచ్చినప్పుడు సాక్ష్యంగా చూపడానికి… బ్యాంకువారి ఎఫ్‌డి రసీదు తప్ప భౌతికంగా ఏమీ లేనందున ఈ కేసు లైఫ్ అయిపోయిందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. కనీసం పట్టుకున్న సొమ్ముకి జిరాక్స్ కాపీలైనా తీయలేదంటున్నారు. అక్రమ నగదు నెంబర్లను, డినామినేషన్లను సైతం ఏసిబి ఎక్కడా నమోదు చేయలేదట! నిందితులు, ప్రాసిక్యూటర్ల సమక్షంలో నగదు పంచనామా జరిపి తటస్థ వ్యక్తి (మీడియేటర్)ద్వారా ఇన్వెంటరీ రికార్డు చేసినట్లయితే, జడ్జి దానినే సర్టిఫై చేసి సాక్ష్యంగా స్వీకరించి ఉండేవారని, ఇప్పుడలాంటి అవకాశం లేకుండా పోయిందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో స్పెషల్ ప్రాసిక్యూటరుగా అపాయింటయిన వి.సురేందర్ రావుకి అసలు బ్యాంకులో ఎఫ్‌డిఆర్‌గా డిపాజిట్టయిన విషయమే తెలియకపోవడం గమనార్హం.  ఇక, ఈ కేసుకు మిగిలిన సాక్ష్యాలుగా వీడియో క్లిప్పింగ్, వాయిస్ నిర్ధారణ చేస్తూ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిన సర్టిఫికేట్ మాత్రమే మిగిలాయి. కీలకమైన నగదుమాత్రం యధాతథ రూపంలో లేదు.