వస్తున్నా…!

252

తమిళనాడు రాజకీయాల్లో మరో పొలిటికల్ సెంటర్‌కి రంగం రెడీ అయ్యింది. “వస్తున్నాను…” అన్నారు జయలలిత మేనకోడలు దీప. పురచ్చి తలైవి కన్నుమూసిన మర్నాటి నుంచే ఆమె మేనకోడలు దీప జయకుమార్ ఇంటికి అభిమానులు క్యూ కడుతున్నారు. జయ వారసత్వాన్ని అందుకుని రాజకీయాల్లోకి రావాలని పోరు పెడుతున్నారు. జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్.కె.నగర్ ఓటర్లు దీపపై వత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో…”త్వరలోనే సొంతంగా పార్టీ పెడుతున్నాను. అమ్మ అభిమానులు, అన్నాడిఎంకె శ్రేణులు అండగా ఉంటారన్న నమ్మకముంది. దివంగత నేత ఎంజిఆర్‌ వారసత్వం నాదే” అన్నారు దీప. తన నివాసం ఎదుట పెద్ద సంఖ్యలో గుమిగూడిన మద్దతుదారులనుద్దేశించి ప్రసంగించడం, వారితో ఓపిగ్గా సమయం వెచ్చించడం పరిపాటిగా మారింది.

జయలలిత మాదిరిగానే దీపకూడా రెండాకుల గుర్తును సూచిస్తూ గాలిలో చేతులు ఊపుతుంటే అభిమానులు పొంగిపోతున్నారు. రూపురేకలు, గొంతు మేనత్తను పోలి ఉండడం దీపకు ప్లస్ పాయింట్లుగా మారాయి. “జయలలలిత వారసురాలు దీపా కుమారే”నంటూ తమిళనాడు అంతటా కటౌట్లు, బ్యానర్లతో శశికళ వ్యతిరేకవర్గం హోరెత్తిస్తోంది. దీప తన మేనత్త, దివంగత సిఎం జయలలితకు పుష్ఫగుచ్ఛం ఇస్తున్నట్లుగా గ్రాఫిక్‌ ఫొటోలతో కటౌట్లు నిలబెడుతున్నారు. క్యాడర్‌ శాంతియుతంగా వేచి ఉండాలని దీప చెబుతున్నారు. ఈ నెల 17న అన్నాడిఎంకె స్థాపకుడు ఎంజిఆర్‌ శతజయంతి సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని మద్దతుదారులకు సూచించారు. “మేం ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. త్వరలోనే ప్రకటన చేస్తాం”అని మీడియాతో అన్నారు దీప.