పదే పదే నీళ్లు పంచలేం!

73

కృష్ణా జలాల విషయంలో ఏమీ చేయలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పేసింది. ఒకసారి రాష్ట్రాల నడుమ నీళ్ల పంపంకం జరిగిన తరువాత… ఆయా రాష్ట్రాల్లో భౌగోళిక మార్పులు జరిగితే, వాటిని పూర్వపు రాష్ట్ర పరిధిలోనే పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్రాలు విడిపోయినప్పుడల్లా జలాల పంపిణీని తిరగదోడడం వీలు పడదని జస్టిస్‌ మదన్‌ బి. లోకూర్, జస్టిస్‌ ప్రఫుల్ల సి.పంత్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కృష్ణా జలాలను ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకతో సంబంధం లేకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యనే పంచాలని జస్టిస్‌ బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సమర్థించింది. బ్రిజేశ్ ట్రిబ్యునల్‌ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 89 విస్తృతార్థాన్ని విస్మరించిందని తెలంగాణ తెలంగాణ తరపున సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ చేసిన వాదనను తోసిపుచ్చింది.

వైద్యనాథన్ తన వాదనలో… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటినే పంచితే తమకు అన్యాయం జరుగుతుందని, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాల మధ్య తిరిగి పంపకాలు చేపట్టాలని కోరారు. “నిధులు, నియామకాలు, నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందనే తెలంగాణ విడిపోయింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 89ని బ్రిజేశ్ ట్రిబ్యునల్ విస్మరించింది. ప్రాజెక్టుల వారీ కేటాయింపులు అన్న నిర్దిష్ట నిబంధనను పొందుపరచడం ద్వారా కృష్ణా నదీ జలాలను నదీ పరివాహక ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాలకు పంచాలని చట్టం యోచించింది. దీని విస్తృతార్థాన్ని ట్రిబ్యునల్‌ విస్మరించింది” అన్నారు.

దీనిపై జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ స్పందిస్తూ “తెలంగాణ రాష్ట్రం ఇకపైనా తెలంగాణ-ఏ, తెలంగాణ-బి, తెలంగాణ-సి అంటూ మూడు రాష్ట్రాలుగా విడిపోయిందనుకుందాం. అప్పుడు మళ్లీ నీటి కేటాయింపులు మొదట్నుంచీ చేస్తారా? ఇలా అన్నిసార్లు తిరగదోడలేం కదా?’’అని ప్రశ్నించి, తెలంగాణ వాదనతో ధర్మాసనం ఏకీభవించ లేదు. అయితే, పెండింగ్‌లో ఉన్న ఇతర పిటిషన్లపై ఈ ఉత్తర్వులు ప్రభావం చూపరాదన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనకు సుప్రీం కోర్టు ధర్మాసనం అంగీకరించింది.