అమెరికాలో జన్-ధన్ మనవాళ్లదే!

88

అమెరికా మొత్తం జనాభాలో ఇండియన్ల సంఖ్య ఒక శాతం. అంటే, 32.5 కోట్ల జనాభాలో ఎన్ఆర్ఐలు 34 లక్షల వరకు ఉన్నారు. వలస జనాభా రీత్యా చూస్తే మనది మూడో స్థానం. ఫస్ట్ రెండు ప్లేస్‌లు చైనా, పిలిప్పీన్స్ దేశాలది. అయితే, సంపద విషయంలో మనవాళ్లదే పైచేయి. అక్కడ రాజకీయ పదవుల్లోనూ ఇండియన్లు పోటీ పడుతున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో అమెరికా ప్రతినిధుల సభకు ఐదుగురు, సెనేట్‌కి ఒకరు భారతీయ సంతతివారు ఎన్నికయ్యారు. చట్టసభల్లోకూడా ఒక శాతం ప్రాతినిధ్యం సంపాదించినట్లయ్యింది. 1965లో ప్రెసిడెంట్ లిండన్ జాన్సన్ (డెమొక్రాట్) తెచ్చిన “ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టం” ఫలితంగా ఇండియా నుంచి డాక్లర్లు, ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో అమెరికాకి పయనమయ్యారు. 1990ల్లోని ఐటి బూమ్ భారతీయుల వలసను ఎన్నో రెట్లు పెంచింది. అమెరికాలో 1965 నాటికి భారత సంతతికి చెందిన ప్రజలు కేవలం 15,000 లోపు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 34 లక్షల వరకూ పెరిగింది.

ఈ నేపథ్యంలో ఇండియా కంపెనీలకు, ఐటీ నిపుణులకు ఉపకరించే హెచ్1-బి వీసాల సంఖ్య పెరుగుతుందేగానీ తగ్గదని అక్కడి ఎన్ఆర్ఐలు చెబుతున్నారు. ఇటీవల డోనాల్డ్ ట్రంప్ హెచ్1-బి వీసా కంట్రోలు గురించి పదే పదే కామెంట్లు చేయడం, కాంగ్రెస్‌లో రిపబ్లికన్లు బిల్లు పెట్టడం… ఇండియన్లలో బెరుకు పుట్టించింది. అయితే మన దేశస్తులను కాదనలేని పరిస్థితులున్నాయంటున్నారు అక్కడివారు. హెచ్1-బి వీసాలను అర్హులకే ఇస్తామని, అమెరికా కంపెనీలు ఇండియాలో స్థాపించడానికి ఒప్పుకోబోనని, అక్కడి నుంచి వచ్చే వస్తువులు, సేవలపై ఆంక్షలు విధిస్తానని ట్రంప్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ కుదిరే పని కాదని ట్రంప్‌ని సమర్థించిన భారతీయ సంతతి రిపబ్లికన్లు, దౌత్య నిపుణులు మాత్రం భరోసా ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే ఏటా 35,000 మంది అమెరికాలో పిజి చేయడానికి వెళ్తున్నారు. అలా వెళ్లినవారిలో అధిక శాతం మంది ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో స్థిరపడుతున్నారు. ప్రతి 100మంది అమెరికన్లలో ఒకరు భారతీయ సంతతి వారే కావడంతో… అమెరికా జన జీవన స్రవంతిలోనూ, ఆర్థిక రంగంలోనూ ఇండియన్లు కీలక భూమిక వహిస్తున్నారు.