అల్లుడే అడ్వయిజర్!

70

అధికారం రాగానే అల్లుడిని చేరదీసినవాళ్ల లిస్టులోకి కాబోయే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేరారు. తన “ట్రంప్ ఆర్గనైజేషన్”ని చూసుకుంటున్న పెద్ద కూతురు ఇవాంక భర్త జారెద్ కుష్నర్ (35)ని సీనియర్‌ అడ్వయిజరుగా నియమించారు. బిజినెస్, మిడిల్ ఈస్ట్‌ వ్యవహారాల్లో ట్రంప్‌కి కుష్నర్‌ సలహాలిస్తారు. అమెరికా అధ్యక్షుడు తన బంధువులకు కీలక పదవులను కట్తబెట్టడం చాలా అరుదు. కుష్నర్ నియామకానికి చట్టబద్దమైన ఆమోదం లభించాల్సి ఉంది. అయితే, అడ్వయిజర్లకు జీతాలు చెల్లించరు కాబట్తి, సెనేట్ అనుమతి అక్కర్లేదు. చట్టబద్ధమైన అనుమతిమాత్రం అవసరం. ఎందుకంటే, ప్రభుత్వ పదవులలో ఆశ్రిత పక్షపాతం చూపకుండా 1967లో చేసిన చట్టం పరిధిలోనే ఈ నియామకం జరిగిందని నిర్ధారణ చేయాలి.

ట్రంప్ మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇద్దరు కుమార్తెలు సహా అయిదుగురు సంతానం. మొదటి భార్యయిన చెకొస్లవేకియా మోడల్ ఇవానా జెల్నిష్కోవాకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఇవాంకను కన్నారు. ఆ కుమార్తె భర్తే కుష్నర్. అల్లుడంటే ట్రంప్ తెగ పొంగిపోతారు. “కుష్నర్‌ నాకు లభించిన అద్భుత ఆస్తి. ఎన్నికల ప్రచారం, అధికార బదిలీలో నమ్మకమైన సలహారుదారు అనిపించాడు” అని తెగ పొగిడేస్తారు. కుష్నర్‌ ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్‌కి అమెరికా ప్రెసిడెంట్ కావాలనే కోరిక పుట్టినప్పటినుంచీ అల్లుడే సలహాదారుడిగా వ్యవహరించాడు.