హెచ్‌సిఏ ఎన్నికలకు ఓకే

76

క్రికెట్ ఆట మైదానంలో ఎంత రసవత్తరంగా సాగుతుందో… క్రికెట్ వ్యవహారాలు అంతకన్నా రంజుగా, ఉత్కంఠగా ఉంటాయి. కోట్ల రూ.లు నొక్కేసిన కేసు ఇప్పటికే నమోదయిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ అసోసియేషన్‌కి ఎన్నికలు ఈ నెల 15న యధాతథంగా జరపాలని, ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. హెచ్‌సీఏ పాత కమిటీకి పదవీకాలం సెప్టెంబర్ 7నాడే ముగిసినా ప్రెసిడెంటుగా అర్షద్‌ అయూబ్‌ కొనసాగడాన్ని హైకోర్టు గతంలోనే తీవ్రంగా తప్పుబట్టింది. కొత్త కమిటీకి ఎన్నికలు నిర్వహించకపోవడం, జస్టిస్ లోధా కమిటీ సిఫారసు ప్రకారం హెచ్‌సీఏ ఎన్నికలు జరపకపోవడంపై కోర్టు ఇదివరకే ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్షద్ పదవీకాలంలో దాదాపు 120 కోట్ల రూ.ల కుంభకోణం జరిగినట్లు డిలైట్ సంస్థ దర్యాప్తులో తేలింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయుబ్, సెక్రటరీ జాన్ మనోజ్‌లపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

అజారుద్ధీన్ నామినేషన్‌పై బిసిసిఐ మౌనం

ఇదిలా ఉండగా, హెచ్‌సీఏ ఎన్నికల్లో భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ కూడా పాల్గొంటున్నారు. హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి ఇప్పటికే అజహర్‌ నామినేషన్‌ వేశారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో అజహర్‌పై ఇండియన్ క్రికెట్ బోర్డ్(బిసిసిఐ) 2000లో జీవితకాలం నిషేధం విధించగా, దాదాపు 12 ఏళ్ల తర్వాత ఏపీ హైకోర్టు బోర్డు నిర్ణయాన్ని తప్పు పడుతూ అజహర్‌ను నిర్దోషిగా తేల్చింది. అయితే ఆ తర్వాత కూడా బిసిసిఐ అధికారికంగా అజహర్‌పై నిషేధాన్ని ఎత్తివేయలేదు. ఆయన పోటీకి బిసిసిఐ అనుమతిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.