లోకేశ్ సిఎం అయ్యాడా?!

95

సోషల్ మీడియాలో మగళవారం మధ్యాహ్నం నుంచి ఇదే మాట చక్కర్లు కొడుతోంది. నారా చంద్రబాబునాయుడు ఏకైక కుమారుడైన నారా లోకేశ్ ఆంధ్ర ప్రదేశ్ సిఎం అయ్యాడట అంటున్నారు! ఎలాంటి ఉలుకుపలుకు లేకుండా, ఏ చానల్‌లోనూ కనీసం స్క్రోలింగ్ అయినా చూపించకుండా ఇంత పెద్ద ఘటన ఎలా జరిగిపోయిందా అని తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. తమకు తెలిసిన అన్ని మీడియా సంస్థలకు ఫోన్లు చేసి అడుగుతుంటే అర్థం కాక మీడియా సంస్థలన్నీ టిడిపి ఆఫీసులకు ఫోన్లు కొట్టాయట! సాయంత్రమయ్యేసరికి అసలు విషయం తెలిసింది. అప్పటికే దేశ విదేశాలకు కబురు పాకిపోయింది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే… ‘ఆంధ్ర ప్రదేశ్ సిఎం’ పేరు మీద ఉన్న అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ని లోకేశ్ వాడుకున్నారు. తన మేనమామ-కమ్-పిల్లనిచ్చిన మామ నందమూరి బాలకృష్ణ నటించిన “గౌతిమీపుత్ర శాతకర్ణి” సినిమాని చూశారు లోకేశ్. ఆనందం పట్టలేకపోయారు. వెంటనే ట్వీట్ చేసేశారు. “గౌతమీపుత్ర శాతకర్ణి”లో బాలయ్య మామయ్య, ఇతర ఆర్టిస్టులు చేసిన నటన మెస్మరైజింగ్‌గా ఉంది. అద్భుత నటనా ప్రతిభతో ఆకట్టుకున్నారు” అని లోకేశ్ తన ఆనందాన్ని పంచుకున్నారు.

మామయ్య సినిమా చూస్తే చూశారుగానీ… ఇలా ముఖ్యమంత్రి అధికారిక అకౌంటులో ట్వీట్ చేయడమేమిటని జనం విస్తుపోతున్నారు. సిఎంకి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాని సొంత కొడుకైనా వాడుకోకూడదు. దానికొక ప్రొటోకాల్ ఉండదా అని నిలదీస్తున్నారు. ఇదండీ లోకేశ్ సిఎం అయిన వైనం! ఇంతకీ, బాలకృష్ణ సినిమా ఈ నెల 13వ తేదీ శుక్రవారం రిలీజ్ కానుంది. లోకేశ్ ఎప్పుడు, ఎక్కడ అడ్వాన్స్‌గా చూశాడో చెప్పలేదు.