మహబూబ్ నగర్ జిల్లాలోఐదుగురు టీచర్లు సస్పెన్షన్

91

మహబూబ్ నగర్ జిల్లా  మిడ్జిల్ మండలంలో కలెక్టర్ రోనాల్డ్ రాస్ పర్యటించారు. వల్లభరావుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లాలోని రెండు మండలాల్లో ఆకస్మిక పర్యటన చేసిన కలెక్టర్‌ ప్రభుత్వ సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ముందుగా మిడ్జిల్‌ మండలం పాఠాలు ఎలా చెబుతున్నారంటూ అడిగారు. అనంతరం తల్లిదండ్రుల పేర్లతో పాటు వారి పేర్లు కూడా రాయాలని సూచించారు. ఐదో తరగతి విద్యార్థులు కూడా వారి తల్లిదండ్రుల పేర్లు సరిగా రాయలేకపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని పాఠశాల ఉపాధ్యాయులను ప్రశ్నించగా.. కార్పోరేట్‌ స్కూల్‌లో చదువుతున్నారని సమాధానం చెప్పారు. ఇక్కడి పిల్లలకు పేర్లు కూడా రాయడం రాదు.. మీ పిల్లలను మాత్రం కార్పోరేట్‌ పాఠశాలల్లో చదివిస్తారా? ఇదేనా పద్ధతి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భానుప్రకాశ్‌తో పాటు మరో నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలు చేయాలని మండల విద్యాధికారి పద్మకు ఆదేశాలు జారీచేశారు. తరువాత ఉర్కొండ మండలం రాచాలపల్లికి వెళ్లారు. అక్కడి ప్రజలు పింఛన్లు సరిగా ఇవ్వడం లేదని లబ్ధిదారులు ఫిర్యాదు చేయడంతో గ్రామ కార్యదర్శిని సస్పెండ్‌ చేశారు.