ఉద్వేగంగా ఒబామా చివరి ప్రసంగం

59

అమెరికా అధ్య‌క్ష హోదాలో త‌మ ప్ర‌జాస్వామ్యాన్ని ర‌క్షించుకోవాల‌ని అమెరికా ప్ర‌జ‌ల‌ను ఆ దేశాధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా కోరారు.  అధ్య‌క్షుడిగా త‌న చిట్ట‌చివ‌రి ప్ర‌సంగం చేసిన ఒబామా త‌న స్వంత ప‌ట్ట‌ణం చికాగో వేదిక‌గా అనేక అంశాల‌పై  ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి భావోద్వేగంగా మాట్లాడారు. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు వ‌ల్లే మంచి అధ్య‌క్షుడిగా మంచి పేరు తెచ్చుకున్నాన‌ని, అందుకు వారికి కృత‌జ్ఞ‌తలు  తెలిపారు. అమెరికా అత్యంత శ‌క్తిమంత‌మైన‌ దేశ‌మ‌ని పేర్కొన్న ఒబామా…  దేశంలో పేద‌రికం త‌గ్గిపోయింద‌న్నారు. అధికార మార్పిడి సాఫీగా జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నాన‌ని పేర్కొన్నారు. సామాన్య ప్ర‌జ‌లు స్పందించిన‌ప్పుడే మార్పు సాధ్య‌మ‌వుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. మార్పు, ఆశావాదం అనే నినాదంతో అమెరికా అధ్య‌క్షుడిగా ఒబామా 2008లో ఎన్నిక‌య్యారు. 55 ఏళ్ల ఒబామా అమెరికా చ‌రిత్ర‌లో మొద‌టి న‌ల్ల‌జాతి అధ్య‌క్షుడు కావ‌డం విశేషం. ఈనెల 20న అమెరికా నూత‌న అధ్య‌క్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

అమెరికా ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో అధ్య‌క్ష అధికార బ‌దిలీ శాంతియుతంగా జ‌ర‌గ‌డం దేశ గొప్ప‌త‌మ‌న్నారు. మూడు అంశాల వ‌ల్ల అమెరికా ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాదం ఉంద‌న్నారు. ఆర్థిక అస‌మాన‌త్వం, జాతి వివ‌క్ష‌, వివిధ వ‌ర్గాల బెదిరింపులు దేశ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు ఆటంకంగా మారే అవ‌కాశం ఉంద‌న్నారు.  ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలన్నారు. అమెరికాలో పేదరికం తగ్గి,  ప్రజల వల్లే అమెరికా శక్తివంతమైన దేశంగా ఎదిగిందన్నారు. మన దేశాన్ని ప్రత్యేకంగా నిలపుకునే సామర్థ్యం, శక్తి మనకు ఉందన్నారు. మరో పది రోజుల్లో అధికార మార్పిడి జరగనుందని చెప్పారు. అమెరికా ప్రస్తుతం ఉన్నతస్థానంలో ఉందన్నారు. ట్విన్ టవర్స్ ను కూల్చిన ఉగ్రవాదులను అంతమొందించామని గుర్తు చేశారు. ఎనిమిదేళ్ల క్రితంతో పోలిస్తే, అన్ని రంగాల్లోనూ, అమెరికా ఉత్త‌మ‌మైన‌, ప‌టిష్ట‌మైన స్థానంలో ఉంద‌న్నారు. కానీ ఉదాసీనంగా ఉంటే, ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాదం ఏర్ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని కూడా ఒబామా హెచ్చ‌రించారు.

దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపే సమయం వచ్చిందని, వారికి కృతజ్ఞతలు తెలిపేరోజు ఇది అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన చివరి ప్రసంగంలో ఉద్వేగానికి లోనయయ్యారు. మన దేశాన్ని ప్రత్యేకంగా నిలుపుకునే సామర్థ్యం మనకు ఉంది. ప్రజల మద్ధతు వల్లే అధ్యక్షుడిని కాగలిగాను. గత కొన్నేళ్లుగా నన్ను, మిషెల్లీ ఒబామాను ఎంతగానో ఆదరించారు. అందుకు మీకు మరోసారి ధన్యావాదాలు తెలియజేసుకుంటున్నాను

రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన ఒబామాకు వీడ్కోలు ప్రసంగానికి డెమొక్రటిక్ పార్టీ నేతలు, ఇతర కీలక నేతలు, అధికారులు హాజరయ్యారు. మరోవైపు ఆయన అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. విశ్వాసం అంటే ఏంటో తాను చికాగో ప్రజల నుంచి నేర్చుకున్నానని ఒబామా అన్నారు. ప్రతిరోజు మీ నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటేనే ఉన్నానని, దేశ ప్రజలందరూ కలిసి తనను బెట్టర్ ప్రెసిడెంట్‌గా, ఉత్తమ వ్యక్తిగా చేశారని ఒబామా వ్యాఖ్యానించారు.