భూముల విలువ పెంపు ఖాయం

995

పెద్ద నోట్ల మార్పిడిని నిషేధించడంతో డిసెంబర్ నెలలో భారీగా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. 2016-17లో 30 శాతం ఆదాయ వృద్ధి లక్ష్యంగా 4,291 కోట్ల రూ.ల టార్గెట్‌ను రిజిస్ట్రేషన్ల శాఖకు ఇచ్చింది ప్రభుత్వం. నోట్ల రద్దువల్ల రెవెన్యూ అంచనాలు తారుమారవుతాయని భావిస్తున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పెరగాలంటే, మార్కెట్‌ విలువ పెంచి, రిజిస్ట్రేషన్‌ ఫీజు ప్రస్తుతం ఉన్న 6 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.

నిజానికి, అక్టోబర్‌ నెల వరకు రికార్డు స్థాయిలో 40 శాతం వృద్ధి కనిపించింది. నవంబర్ 8న దేశవ్యాప్తంగా కరెన్సీ రిఫార్మ్స్ మొదలెట్టాక 500, 1,000 నోట్ల రద్దుతో… ఒక్కసారిగా తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. మొదటి 15 రోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు పొలోమంటూ వచ్చాయి. పాత నోట్లతో రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించడానికి కేంద్రం అనుమతించడంవల్ల 2016 నవంబర్ నెల ఆదాయం… 2015 నవంబరుకన్నా 12 శాతం ఎక్కువగా నమోదయ్యింది. పాత నోట్లకు అనుమతిని డిసెంబర్ మొదటి వారంలో కేంద్రం ఎత్తేయడంతో ఒక్కసారిగా ఆదాయం తగ్గింది. 20,000 రూ.లకు మించినట్లయితే క్యాష్‌లెస్ లావాదేవీలు జరపాలి. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని వారంతా ఇప్పటివరకు తమ వద్దఉన్న అన్‌-అకౌంటెడ్‌ సొమ్మును ఆస్తుల కొనుగోలుకు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు మార్చుకునే వీలు ఉండేది. ఇప్పుడా వెసులుబాటు లేదు. వచ్చే మార్చి వరకు మూడు నెలలపాటు ఇదే తీరు కొనసాగేలా కనీస్తుంది. వార్షిక ఆదాయ లక్ష్యం చేరడం సాధ్యం కాదు.

దీనికితోడు మూడేళ్లుగా భూముల మార్కెట్‌ వాల్యూ సవరించలేదు. ఆస్తుల క్రయ విక్రయాలపై ఇది బాగా ప్రభావం చూపుతోంది. బహిరంగ మార్కెట్‌లో కోటి రూ.ల విలువగల భూమికి రిజిస్ట్రేషన్ల శాఖవారి దగ్గర వాల్యూ 20 లక్షల రూ.లకు మించి లేదు. ఏదైనా ఆస్తిని రిజిస్ట్రేషన్‌ చేయాలంటే… రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధనల ప్రకారం సదరు ఆస్తి విలువలో 6 శాతం స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజుగా కొనుగోలు చేసిన వ్యక్తి చెల్లించాలి. ధరల సవరణ జరగనందువల్ల రిజిస్ట్రేషన్ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల సాధ్యపడడం లేదు. మార్కెట్‌ నాల్యూని పెంచడంతోపాటు రిజిస్ట్రేషన్‌ ఫీజును 6 శాతం నుంచి 2 శాతానికి తగ్గించినట్లయితే రిజిస్ట్రేసన్ల శాఖకు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందంటున్నారు. త్వరలోనే తెలంగాణ సర్కారు ఒక నిర్ణయానికి వస్తుందని, మార్కెట్ వాల్యూ అమాంతంగా పెరిగే అవకాశాలున్నాయని రియల్టర్లు చెబుతున్నారు.