నీటి దొంగలకు ఇక కష్టకాలం

256

హైదరాబాద్ నగరంలో నీటి దొంగల ఆట కట్టించడానికి వాటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. దీనికి గాను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని బోర్డు భావిస్తోంది. హైదరాబాద్ నగరంలో నిత్యం గృహాలు, వాణిజ్య అవసరాలకు 404 మిలియన్‌ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నారు. దీనిలో దాదాపు 40 నుంచి 45 శాతం నీటికి బిల్లుల చెల్లింపు జరగడం లేదు. సరఫరా చేసే ప్రతి నీటి బొట్టుకీ బిల్లు వసూలు చేయాలన్న ఆలోచనతో వాటర్ బోర్టు ప్రతి ఒక్క నీటి కనెక్షన్ కూ మీటర్ బిగించాలని చేసిన ప్రయత్నం ప్రజల నుంచి సరైన స్పందన రాక సఫలం కాలేదు. దీంతో వాటర్ బోర్డే ప్రతి కనెక్షన్ కు మీటర్ అమర్చాలని భావిస్తోంది. దీనికయ్యే ఖర్చును ప్రతి నెలా వినియోగదారుల నెలవారీ బిల్లులతో విడతవారీగా వసూలు చేయాలని భావిస్తోంది. అదేవిధంగా జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (జీఐఎస్)తో పనిచేసే స్కాడాను పైపులైన్లకు అనుసంధానం చేయడం ద్వారా ఎప్పటికప్పుడు నీటి సరఫరాను పర్యవేక్షించాలని నిర్ణయించింది. దీనివల్ల ఏ పైప్ లైన్ నుంచి ఎంత నీరు సరఫరా అవుతోందో ఇట్టే పసిగట్ట వచ్చు. అంతేకాక ఆ నీరు ఎక్కడికి సరఫరా అయిందో కూడా సులభంగా తెలుసుకోవచ్చు.