అటకెక్కిన శివారు బస్ స్టేషన్లు

229

నానాటికీ శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య ప్రజలకు నిత్యం నరకం చూపిస్తోంది. నగరవాసులతో పాటు నిత్యం అనేక పనుల నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిపోయే వారు కూడా ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. నగర శివార్లలో ఎక్కడికక్కడ బస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్య నుంచి ప్రజలకు కొంత వరకైనా విముక్తి కల్పించవచ్చని గతంలో అధికారులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు కూడా రూపొందించారు. దీని ప్రకారం నగర శివారు ప్రాంతాలైన ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, సాగర్‌ రోడ్డు, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్‌, లంగర్‌హౌజ్‌, నార్సింగి, మియాపూర్‌, జీడిమెట్ల, అల్వాల్‌ ప్రాంతాల్లో కొత్తగా సిటీ, దూర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇదే విషయాన్ని హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ తన మాస్టర్‌ ప్లాన్‌లో కూడా పొందుపర్చింది. అయితే నిధుల లేమి, స్థలాల కొరత కారణంగా ఈ ప్రతిపాదనలు నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ప్రస్తుతం నగరం నడి మధ్యలో ఉన్న మహాత్మా గాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్ లపై ట్రాఫిక్‌ ఒత్తిడి పెరుగుతోంది. ఆర్టీసీ అధికారులు శివార్లలోనే బస్‌ టెర్మినల్స్‌ను ఏర్పాటు చేయాలని పదే పదే చెబుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలు ఈవిషయంలో చూపుతున్న చొరవ మొక్కుబడిగానే ఉంటోంది.