కళ్ళు లేని ‘కనుపాప’!

275

చిత్రం : కనుపాప
నిడివి : 2గంటల 21 నిముషాలు
సమర్పణ: దిలీప్ కుమార్ బొలుగోటి
బేనర్ : ఓవర్సీస్ నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్
కథ : గోవింద్ విజయన్
మాటలు : రాజశేఖరరెడ్డి
ఫోటోగ్రఫీ : కెఎన్ ఏకాంబరం
ఎడిటింగ్ : యం.యస్. అయ్యప్పన్ నాయర్
సంగీతం : ఎల్దోసే, జిమ్. బిబి మరియు జస్టిన్
నిర్మాత : వి. మోహన్ లాల్
స్క్రీన్ ప్లే – దర్శకత్వం : ప్రియదర్శన్
నటులు : మోహన్ లాల్, బేబీ మీనాక్షి, విమల రామన్, అనుశ్రీ, సముద్రఖని, నెడుమూడి వేణు, రజని పణిక్కర్, చెంబాన్ వినోద్, కళాభవన్ శాజోహ్న్, మముక్కోయ తదితరులు.

మళయాళ నటులు మోహన్ లాల్ తెలుగుతెరకు సుపరిచితులే. ఇటీవల మనమంతా, జిల్లా, జనతా గ్యారేజ్ తాజాగా మన్నెం పులి చిత్రాలతో మరింత తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కేరళలో ఓనం కానుకగా ‘ఒప్పం’ పేరుతో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ‘కనుపాప’గా అనువదించి మనముందుకు తీసుకువచ్చారు. కేరళలో మంచి కలక్షన్లు రాబట్టి ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించడం, మోహన లాల్ నిర్మించడం విశేషం. పైగా ఈ సినిమాలో మోహన్ లాల్ గుడ్డివాడిగా నటించడం మరో ఆసక్తికర అంశం.

మనకు ప్రేమ కథా చిత్రాలే అధికం. అప్పుడప్పుడూ హర్రర్ చిత్రాలు వచ్చినా థ్రిల్లర్ చిత్రాలు తక్కువనే చెప్పాలి. ‘కనుపాప’ థ్రిల్లర్ చిత్రం. కథకొస్తే- జయరామ్ (మోహన్ లాల్) లిఫ్ట్ ఆపరేటర్ గా ఓ అపార్మెంట్లో పని చేస్తూ అందరి అవసరాలు తీరుస్తూ తన బతుకు తెరువు అవసరం తీర్చుకుంటూ వుంటాడు. జయరామ్ కు కంటి చూపులేదు. అయినా అతనికి కళ్ళు వున్నాయని కొందరు అనుమానిస్తూ వుంటారు. కారణం చూపు లేకపోయినా దృష్టి కలవాడు. విచక్షణ కలవాడు. వినికిడి ద్వారా అంచనా వెయ్యగలవాడు. వాసన ద్వారా పసిగట్టగలవాడు. కళ్ళు లేవని చెపితే కూడా నమ్మలేని విధంగా స్పృహ కలవాడు. అదే అపార్ట్మెంట్లో వుండే రిటైర్డ్ జడ్జ్ మూర్తి(వేణు)తో కాస్త చేరికగా చనువుగా నమ్మదగిన వ్యక్తిగా వుంటాడు జయరామ్. మూర్తి జయరామ్ ని నమ్ముతాడు.

అందుకే తన వ్యక్తిగత జీవితం గురించి కూడా చెపుతాడు. మరో వేపు వరుసగా హత్యలు జరుగుతూ వుంటాయి. ఒక హత్యకూ మరొక హత్యకూ సంబంధం ఉందనీ లేదనీ పోలీసు అధికారులు తమ అహం ప్రదర్శిస్తూ వుంటారు. అదే సమయంలో రిటైర్డ్ జడ్జ్ మూర్తిని యెవరో కనిపెడుతున్న విషయం జయరామ్ గ్రహించి చెపుతాడు. అప్పుడు రిటైర్డ్ జడ్జ్ మూర్తి తను దాచిన కథ చెపుతాడు. ఆగంతకుడు తనని వెంటాడుతున్న విషయం చెప్పి ఊటీలో రహస్యంగా చదివిస్తున్న పాప నందిని(బేబీ మీనాక్షి)ని జాగ్రత్తగా కాపాడాలని కోరుతాడు. అయితే జడ్జిని హత్య చేసిన హంతకుడు యెవరు? పాప ఆచూకీ తెలుసుకొని చంపాలనుకున్న ఆగంతకుడు వాసు యెవరు? పాపకి ఏమవుతాడు?  కళ్ళు లేని జయరామ్ హంతకుణ్ణి పట్టుకున్నాడా? పాపని కాపాడుకున్నాడా? అనేది తెరమీద చూడాల్సిన చిత్రం.

సినిమాని మనం ఏం జరుగుతుందా అని వుగ్గబట్టుకొని చూస్తాం. అయితే సినిమాలో పాటలకోసం కల్పించిన సందర్భాలు కథా వేగాన్ని నెమ్మదించేలా చేస్తాయి. అలాగే పాపతో సెంటిమెంటు మేళవింపు తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ థ్రిల్లరు బిగువును సడలిస్తాయి. అలాగే కథలో స్థానికతని కప్పి పుచ్చి తెలుగు సేత చేయడంలో అందరికీ చేరాలని చేసిన భాష.. మాటలు వాస్తవాన్ని ఎడంగా ఉంచే ప్రయత్నం చేస్తాయి. విలన్ చుట్టుపక్కలే వున్నా పోలీసుల కనీసమైన కన్ను కనపడదు. అలాగే లేడీ పోలీసు అధికారిని వుపయోగించుకోకపోవడం వల్ల ఆపాత్ర నిరుపయోగమైంది. యువప్రేమికుల జంటనీ వుపయోగించు కోలేదు. ఈలోపాలు మినహాయిస్తే సినిమాలో లీనమయ్యేందుకు మోహన్ లాల్ నటన మనల్ని కథలోకి లాక్కెలుతుంది. దర్శకుడు ప్రియదర్శన్ మార్కు హాస్యం తగ్గినా సినిమా బొరుకొట్టదు. నిర్మాణ విలువలు బావున్నాయి. థ్రిల్లర్ సినిమాలో పాటలకు పెద్ద వులువ వుండదు. ఇక్కడా లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథకి సహకరించేలా వుంది.

థ్రిల్లర్ ని యిష్టపడేవాళ్ళు ఈ సినిమాని తప్పక చూడొచ్చు!

రేటింగ్: 3/5

-జాసి