ఆటిట్యూడ్ యీజ్ ఎవ్విర్తింగ్ అనే ‘నేను లోకల్’!

288

చిత్రం : నేను లోకల్
సమర్పణ: దిల్ రాజు
బేనర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
రచన : సాయి కృష్ణ
కథ – స్క్రీన్ ప్లే – మాటలు : ప్రసన్నకుమార్ బెజవాడ
ఫోటోగ్రఫీ : నిజార్ షఫీ
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
అసోసియేట్ ప్రొడ్యూసర్ : బెక్కం వేణుగోపాల్
కో ప్రొడ్యూసర్ : హర్షిత్ రెడ్డి. నిర్మాత : శిరీష్
స్క్రీన్ ప్లే – దర్శకత్వం : త్రినాధరావు నక్కిన. నటులు : నానీ, కీర్తి సురేష్, సచిన్ ఖడేకర్, నవీన్ చంద్ర, పోసాని కృష్ణ మురళి, ఈశ్వరీ రావు, తులసి, రావు రమేష్, కృష్ణ భగవాన్, వెన్నెల కిషోర్ తదితరులు.

తీసిన సినిమానే తియ్యడం.. చూసిన సినిమాలనే చూడడం.. ఎంత కాదనుకున్నా మనకు అలవాటు. అందులో ఏమాత్రం కొత్తదనం వున్నా ఆ సినిమా మళ్ళీ మళ్ళీ మనముందుకు వస్తుంది. ఒక సినిమా విజయం అనేక సినిమాలు రావడానికి కారణమవుతుంది. ఆ కొత్తదనం పేరే నాని. ఆ సినిమా పేరే ‘నేను లోకల్’.

‘నువ్వే నువ్వే’, ‘ఇడియట్’, ‘సినిమా చూపిస్త మామా’.. యిలా చాలా సినిమాలనే గుర్తుకు తెచ్చిన ఈ సినిమా బోరుకొట్టకుండా నవ్విస్తుంది. చూసిన సినిమాయే అనిపిస్తుంది. నానీ బాగా చేసాడు. డైలాగులు బాగున్నాయి. టైమింగ్ బాగుంది. ‘సినిమా చూపిస్త మామా’ నుండి దర్శకుడు యింకా బయటకు రాలేదు అని కూడా అనిపిస్తుంది. యూత్ కు కనెక్ట్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ వుంది. అందమైన కీర్తి సురేష్ వుంది. ఒకే బావుంది. సినిమా ఆడుతుంది. పాత సినిమాలే కొత్త సినిమాలుగా మనముందుకు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. యిదీ కథ.

సరే కథ కొస్తే- ఒక లక్ష్యం లేని అబ్బాయి. చదువు కూడా ఎక్కని అబ్బాయి. వాడి పేరు బాబు(నానీ). వాడితో బాధ పడలేక ఇన్విజలేటర్ తనే బుక్కు యిచ్చి కాపీ చేయించి పాస్ అయేలా చేసేలాంటి ఆటిట్యూడ్. పైకి ఒకటి లోపల వొకటి కాదు. అదే వాడి బలం. ఇంజనీరింగ్ అయ్యింది. వాట్ నెక్స్ట్? కనిపించిన ప్రతీ వాళ్ళదీ అదే ప్రశ్న. విసిగివేసారుతున్న సమయంలో అనుకోకుండా కీర్తి(కీర్తి సురేష్) బాబు జీవితంలోకి వస్తుంది. పొరపాటున. ఇంక డిస్ట్రబ్ అయ్యి డిస్ట్రబ్ చేసే బాబు. కీర్తి అసలే తండ్రిచాటు బిడ్డ. కాని బాబుని దూరం పెడుతూనే దగ్గరవుతుంది. డిస్ట్రబ్ అయ్యానని గ్రహిస్తుంది. అది ప్రేమని వొకరిని వొకరు కలుసుకుంటారనగా సిద్దార్థ వర్మ(నవీన చంద్ర) ఎంటర్ అవుతాడు. నాలుగేళ్ళుగా ప్రేమించానని.. తన కీర్తిజోలికి వస్తే వూరుకోనని. మరి మామ నుండి.. పాత లవర్నుండి.. పెట్టిన గడువులోపల ఎలా నాని పరిస్థితులను తనవైపుకు తిప్పుకున్నాడన్నదే మిగతా కథ.

కథలో కొత్తదనం లేకపోయినా సీన్లు యిదివరకు చూసినవే అనిపించినా నాని తన నటనతో ఆ విషయాల్ని మనం మరిచిపోయేలా చేస్తాడు. అందుకే కథ ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి ‘రిపీట్’ సర్కిల్ లో వచ్చి పడుతుంది. నాటకీయంగా వున్నా నాని తలిదండ్రులుగా పోసాని, ఈశ్వరీల పాత్రలు ఆకట్టుకొని హాస్యాన్ని పంచుతాయి. తండ్రికీ ప్రేమించిన అబ్బాయికీ మధ్య నలిగిన అమ్మాయిగా కీర్తికి నటనావకాశాన్ని కొంతవరకు వుపయోగించుకుంది. ఎంటర్టైన్మెంట్ వల్ల కథ పాతదైనా దాని నాటకీయతను మరిచి.. వాస్తవాన్ని మరిచి.. సినిమా అని మనం కూడా సరిపెట్టుకుంటాము. సినిమా బోరు కొట్టకుండా సరదాగా టైం పాస్ చేస్తుంది. సినిమాలో పాటలు రొటీన్. క్వాలిటీ విషయంలో కాస్త తగ్గి కనిపిస్తుంది.

లాజిక్కులు వెతకడం మాని కాసేపు నవ్వుకోవడానికి ఈ సినిమాని చూడొచ్చు!

రేటింగ్ :2.75/5

-జాసి