వచ్చేనెల నుంచి ఆదివారాలు పెట్రోల్ బంక్ లు బంద్

355

కమీషన్ పెంపుపై కేంద్ర ప్రభుత్వ తాత్సార వైఖరిని నిరసిస్తూ పెట్రోల్ బంక్ యజమానులు వినూత్నరీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. కమీషన్ పెంచనందుకు నిరసనగా మే 14 నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్ లు మూసి వేయాలని వారు నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా  మే 10న కొనుగోళ్ల నిరాకరణ దినం పాటించనున్నారు. అంటే బంకు డీలర్లెవరూ సంస్థల నుంచి ఇంధనం కొనుగోలు చేయరు. ఫలితంగా తర్వాత రోజుల్లో బంకుల్లో ఇంధన కొరత సమస్య ఏర్పడనుంది. ప్రస్తుతం డీలర్లకు పెట్రోల్‌పై లీటరుకు 2.333 రూపాయలు, డీజిల్‌పై 1.620 కమీషన్ లభిస్తున్నది. పెట్రోల్‌పై 3.333, డీజిల్‌పై 2.126 రూపాయలు కమీషన్ ఇవ్వాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నాయి. కమీషన్ భారీగా పెంచుతామని నాలుగు నెలల క్రితం హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకూ ఆ ఊసే ఎత్తడం లేదని డీలర్లు ఆరోపిస్తున్నారు. అందుకే నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని వారు తెలిపారు.