నిరుద్యోగ ర్యాలీలో టెన్షన్

223

తెలంగాన జెఏసి ఇచ్చిన పిలుపుతో హైదరాబాద్ నగరంలో టెన్షన్ ఏర్పడింది. నిరుద్యోగ ర్యాలీకి వస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ ర్యాలీని భగ్నం చేయాలని పోలీసు యంత్రాంగం, ఆరునూరైనా జరపాలని తెలంగాణ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పట్టుదలగా ఉండడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మంగళవారం నుంచే పోలీసులు తగు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. జిల్లాల నుంచి వచ్చేవారిని ఎక్కడికక్కడ బస్టాండులు, రైల్వే స్టేషన్లలో నిలిపివేశారు. కాగా, బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్దకు వేర్వేరు మార్గాలద్వారా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలతోపాటు నిరుద్యోగులు తరలివచ్చారు. అక్కడినుంచి ర్యాలీకి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వ్యతిరేకంగా నిరుద్యోగులు నినాదాలు చేశారు.

ఈ ర్యాలీకి ప్రభుత్వ అనుమతి లేదు. టి-జెఏసి హైకోర్టును ఆశ్రయించినప్పటికీ హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసి, ఆదివారం రోజున నిర్వహించుకోవడానికి ఇబ్బందులేమిటని టి-జెఏసిని ప్రశ్నించింది. “పోలీసులు ప్రతిపాదిస్తున్నట్లుగా మియాపూర్‌ మెట్రో రైల్‌ గ్రౌండ్స్‌లో ఎందుకు సమావేశం పెట్టుకోకూడదు” అని జస్టిస్‌ రామలింగేశ్వరరావు ప్రశ్నించారు. ఈ తరుణంలోనే జెఏసి సడన్‌గా మంగళవారం తన పిటిషన్‌ ఉపసంహరించుకుంది. అయినప్పటికీ బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ నిర్వహిస్తామని జెఏసి చైర్మన్‌ కోదండ రామ్ చెప్పడాన్ని ప్రభుత్వ వర్గాలు తప్పుబడుతున్నాయి.